ఈ రోజుల్లో సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం పెద్ద సమస్యగా మారిపోతోంది. ఒకప్పట్లా హీరోల వయసులో మూడో వంతున్న హీరోయిన్లతో జట్టు కట్టించి రొమాన్స్ చేయించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇద్దరి మధ్య వయసు అంతరం ఎక్కువ ఉన్నట్లు కనిపించినా.. హీరోల ముందు హీరోయిన్లు చిన్నమ్మాయిల్లా అనిపించినా.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగిపోతోంది.
అందుకే ఫిలిం మేకర్స్ జాగ్రత్తగా హీరోయిన్లను ఎంచుకుంటున్నారు. కొంచెం వయసు పైడ్డ హీరోయిన్లనే సీనియర్ల పక్కన నటింపజేస్తున్నారు. కానీ ప్రతిసారీ ఇలా సాధ్యపడదు. కొన్నిసార్లు పడుచు హీరోయిన్లతోనూ వెళ్లాల్సి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి.. రీఎంట్రీ తర్వాత కాజల్, తమన్నా లాంటి తర్వాతి తరం కథానాయికలతో జట్టు కట్టారు. విశ్వంభరలో త్రిష, మన శంకర వరప్రసాద్‌లో నయనతార ఆయన సరసన నటిస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఐతే బాబీ సినిమాకు కథానాయికను సెలక్ట్ చేయడం మాత్రం సవాలుగానే మారినట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే రాజాసాబ్‌లో ప్రభాస్‌కు జోడీగా నటించిన మలయాళ భామ మాళవిక మోహనన్‌ను చిరు సినిమాకు కథానాయికగా తీసుకున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది. ఈ జోడీ బాగుంటుందా.. చిరు పక్కన మాళవిక చిన్నమ్మాయిలా అనిపిస్తుందా అనే చర్చ జరుగుతుండగా.. మాళవిక లైన్లోకి వచ్చేసింది. చిరు సినిమాలో నటించడం అంటే గొప్ప అవకాశమని.. కానీ తాను ఆ సినిమాలో భాగం కాదని ఆమె స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో మాళవిక ఒక పోస్టు పెట్టింది.
”హాయ్ గయ్స్.. బాబీ దర్శకత్వంలో రానున్న మెగా 158 మూవీలో నేను భాగం కాబోతున్నట్లు చాలా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సర్ లాంటి దిగ్గజంతో పని చేయడాన్ని నేనెంతో ఇష్టపడతాను. కెరీర్లో ఏదో ఒక దశలో ఆ అవకాశం వస్తుందనుకుంటున్నా. కానీ ఈ ప్రాజెక్టులో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం నిజం కాదు” అని మాళవిక స్పష్టం చేసింది. మరి మాళవిక కాదంటే బాబీ ఛాయిస్ ఎవరవుతారో చూడాలి. ఈ చిత్రంలో కార్తి ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల న్యూస్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.