జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో ఐదు రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇప్పటి వరకు ఇంటింటి ప్రచారం, ప్రసంగాలు చేసుకున్న నాయకులు.. తాజాగా ప్రజలను మరింతగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో సవాళ్లు-ప్రతిసవాళ్లు రువ్వుకుంటున్నారు. ఇదేసమయంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిపైనా ప్రత్యక చర్చకు దిగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సవాల్ రువ్వారు.
జూబ్లీహిల్స్‌లో ఎవరు అభివృద్ధి చేశారో.. ఎవరు ప్రజలకు మేలు చేశారో చర్చించేందుకు తాము సిద్ధమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుకు రావాలని సవాల్ ఇచ్చారు. ఎవరిది చెత్త పాలనో.. ఎవరిది సత్తా పాలనో తేల్చుకుందామని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన “జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక” పేరుతో ఒక నివేదికను విడుదల చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో నగరంలో ఎలాంటి అభివృద్ధి చేశామో చూడాలని ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో రహదారుల నుంచి డ్రైనేజీల వరకు పలు అంశాలను ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ రెండేళ్లలో ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్క రోడ్డయినా వేశారా? ఒక్క బ్రిడ్జి అయినా కట్టారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని.. అయినా తాను సీఎం పదవికి గౌరవం ఇస్తానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండేళ్లలో కాంగ్రెస్ ఏదైనా మంచిచేసి ఉంటే చెప్పాలని సవాల్ రువ్వారు. ఎక్కడైనా సరే.. చర్చకు రెడీగా ఉన్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగానే కాకుండా.. శాఖల పరంగా కూడా రేవంత్ రెడ్డి విఫలమ య్యారని కేటీఆర్ విమర్శించారు.