hyderabadupdates.com movies చెన్నైకి 2.2 లక్షల వీసాలా? అమెరికాలో కలకలం రేపుతున్న ఆరోపణలు

చెన్నైకి 2.2 లక్షల వీసాలా? అమెరికాలో కలకలం రేపుతున్న ఆరోపణలు

అమెరికాలో H-1B వీసాల వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. అమెరికా మాజీ చట్టసభ సభ్యుడు, ఆర్థికవేత్త డేవ్ బ్రాట్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇందుకు కారణం. ఏడాదికి అమెరికా మొత్తం మీద మంజూరు చేయాల్సిన H-1B వీసాల పరిమితి కేవలం 85,000 మాత్రమే. కానీ, ఒక్క చెన్నై ప్రాంతం నుంచే ఏకంగా 2,20,000 వీసాలు పొందారని, ఇది స్పష్టంగా భారీ మోసమని ఆయన ఆరోపించారు. దేశం మొత్తానికి ఉన్న పరిమితి కంటే, ఒక్క జిల్లా నుంచే రెండున్నర రెట్లు ఎక్కువ వీసాలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన బ్రాట్, H-1B వ్యవస్థలో “పారిశ్రామిక స్థాయి మోసం” జరుగుతోందని మండిపడ్డారు. మొత్తం H-1B వీసాల్లో 71 శాతం భారతీయులకే దక్కుతున్నాయని, కేవలం 12 శాతంతో చైనా రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇంత భారీ వ్యత్యాసం ఉండటమే అనుమానాలకు తావిస్తోందని అన్నారు. చెన్నై కాన్సులేట్ పరిధిలో తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఐటీ హబ్స్ అయిన బెంగళూరు, హైదరాబాద్ నుంచి వచ్చే అప్లికేషన్లన్నీ ఇక్కడే ప్రాసెస్ అవుతాయి కాబట్టి సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు. కానీ బ్రాట్ మాత్రం దీన్ని మోసంగానే చూస్తున్నారు.

ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా, చెన్నై కాన్సులేట్‌లో పనిచేసిన మాజీ దౌత్యవేత్త మహ్వాష్ సిద్దిఖీ కూడా రీసెంట్‌గా కొన్ని బాంబులు పేల్చారు. 2024లోనే సుమారు 2.2 లక్షల H-1B వీసాలు, వారి కుటుంబ సభ్యులకు 1.4 లక్షల H-4 వీసాలు ఇచ్చారని ఆమె తెలిపారు. అయితే, ఇందులో చాలా వరకు ఫేక్ అని ఆమె ఆరోపించారు. నకిలీ ఆఫర్ లెటర్లు, ఫోర్జరీ చేసిన డిగ్రీలు, ఒకరికి బదులు మరొకరు ఇంటర్వ్యూలకు హాజరవ్వడం (Proxy interviews) వంటి పద్ధతుల్లో వీసాలు పొందుతున్నారని అన్నారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ దందా బాహాటంగానే సాగుతోందని సిద్దిఖీ ఆరోపించడం గమనార్హం. అక్కడ కొన్ని సంస్థలు అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వడంతో పాటు, నకిలీ అనుభవ పత్రాలు, విద్యా సర్టిఫికెట్లను అమ్ముతున్నాయని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో స్థానికుల ఉద్యోగాలను ఈ ‘స్కిల్డ్’ కాని వ్యక్తులు తక్కువ జీతానికి పనిచేస్తూ లాక్కుంటున్నారని, దీనివల్ల అమెరికన్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని డేవ్ బ్రాట్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related Post