ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి రాజ్యాంగపరమైన కీలక నాయకుడు. బాధ్యుడు కూడా. అయినప్పటికీ .. వారికి కూడా విశ్రాంతి, కుటుంబం వంటివి ఉంటాయి. దీంతో నిర్దిష్ట సమయం వరకు పనిచేసిన తర్వాత.. ఇంటికి వెళ్లిపోవడం.. అనేది ముఖ్యమంత్రుల విషయంలో కామనే. గతంలో వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్.. టైం బౌండ్ పెట్టుకుని పనిచేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేశారన్న వాదన బలంగా వినిపించింది.
మధ్యలో లంచ్ బ్రేక్‌తో సహా ఆయన ఇతమిత్థంగా 7 గంటల పాటు పనిచేశారని.. వారానికి 4-5 రోజులు మాత్రమే అందుబాటులో ఉండేవారని.. అప్పటి అధికారులు కొందరు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పకొచ్చారు. సో.. ముఖ్యమంత్రిగా ఫుల్ టైమ్ చేసేందుకు జగన్ పెద్దగా మనసు పెట్టలేదన్న వాదన బలంగా వినిపించింది. ఈయనతో పోల్చితే.. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఫుల్ టైమ్ చేస్తున్నారనే చెబుతున్నారు పార్టీ నాయకులు, మంత్రులు కూడా.
వాస్తవానికి చంద్రబాబు వయసు 75 సంవత్సరాలు. దీనిని బట్టి ఆయన కనీసంలో కనీసం.. మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో 2-3 అవర్స్ అయినా రెస్టు తీసుకుంటారని అనుకుంటారు. కానీ, ఆయన ఇలా ఎప్పుడూ రెస్టు తీసుకోలేదు. పైగా అత్యవసర సమయాల్లో అయితే.. అంటే.. తుఫానులు, వరదలు వచ్చినప్పుడు.. నిరంతరం వాటిపైనే దృష్టి పెడుతున్నారు. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడ వరదలు వచ్చినప్పుడు.. మోకాల్లోతు నీటిలో సీఎం చంద్రబాబు తిరిగిన విషయం ప్రస్తావనార్హం.
ఇక, ఇప్పుడు మొంథా తుఫాను వచ్చింది. ఇది ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లిన ముఖ్యమంత్రి రాత్రి 11 గంటల వరకు అలానే ఉన్నారు. ఎక్కడా నడుం వాల్చలేదు. జిల్లాల సమీక్షలు ఉన్నతాధికారులతో మాటా మంతీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అంచనాలు.. మరోవైపు ప్రధానిమోడీతో సంభాషణ.. నిధుల విషయంపై ఆరా.. బాధితులకు అందుతున్న భరోసా.. జిల్లాల్లో కురుస్తున్న వానలు.. ఇలా ఫుల్ టైమ్ వెచ్చించారు. ఈ ఒక్కసారే కాదు.. ఇటీవల విదేశీ పర్యటనలోనూ చంద్రబాబు ఎక్కడా రెస్టు తీసుకోలేదు. దుబాయ్‌లో అయితే.. ఏకంగా 4గంటల పాటు నిలబడే అక్కడి ప్రవాసులతో సంభాషించారు.