రాజకీయాల్లో పొగడ్తలంటే ఎవరికి ఇష్టముండవు? తమ గురించి అనుచరులు, అనుయాయులు భజన చేస్తుంటే చాలామంది నేతాశ్రీలకు వినసొంపుగా ఉంటుంది. నేతల మెప్పు పొందేందుకు భజన చేసే అనుచరులకు అడ్డూ అదుపే లేదు. ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరుల్లో కొంతమంది కూడా ఆ కోవలోకే వస్తారని మాజీ ఎంపీ , వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటున్నారు. జగన్ మెప్పు కోసం భజనలు చేయవద్దని వైసీపీ నేతలకు ఆయన హితబోధ చేస్తున్నారు.
జగన్ క్షేమం కోరితే ప్రజల క్షేమం కోరినట్లే నని, అలా..ప్రజలు, జగన్ క్షేమం కోరేవారు ఇలా భజనలు చేయాల్సిన పనిలేదని అంటున్నారు. అప్పుడే ప్రజలు వైసీపీని, వైసీపీ నేతలను ఆదరిస్తారని మేకపాటి సూచించారు. ప్రజలు చదువుకుంటున్నారని, చైతన్యవంతులయ్యారని, ఇటువంటి భజనలు చేయడం వల్ల ఉపయోగం లేదని. పద్ధతిగా నడుచుకోవాలని, ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా అప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందని, భవిష్యత్తు ఉంటుందని చెప్పారాయన. తప్పులు, బూతులు మాట్లాడకూడదని హితవు పలికారు. మరి, మేకపాటి సలహాలు, సూచనలు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాటిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
మేకపాటి చెప్పింది అక్షర సత్యం. కానీ, వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. మరి, ఇంత చేదు గుళికలను వైసీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోగలరా? అంటే కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే, గత ఎన్నికల్లోఈ చేదు గుళికలు మింగలేకే వైసీపీ ఓటమి పాలైంది. ఇలాంటి భజన బ్యాచ్ వల్ల జగన్ హ్యాపీగా ఫీల్ అవుతారేమోగానీ, పార్టీకి మాత్రం చాలా డ్యామేజీ జరిగింది. ఈ టైప్ బ్యాండ్ మేళం బ్యాచ్ వల్ల వైసీపీ అనే కాదు ఏ పార్టీ కూడా బలపడదు. ఇక, ఈ టైప్ బ్యాచ్ ఏ పార్టీ అధినేతకైనా డేంజరే. అయితే, జగన్ కూడా ఇటువంటివి కోరుకుంటున్నారు కాబట్టే అలా చేస్తున్నామని చేసే నేతలూ లేకపోలేదు.
అటువంటి వారు ఇకనైనా మారాలన్నదే మేకపాటి కామెంట్లలోని ఆంతర్యం. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమిటి అన్నది ఆ పార్టీ అధినేతకు తెలియపరచడం నేతలు, కార్యకర్తల బాధ్యత. అంతేకాదు, అలా చెప్పిన వాస్తవాలను అంగీకరించడం, లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్లడం అనేది జగన్ వంటి పార్టీ అధినేతల బాధ్యత. అది విస్మరించిన నాడు పార్టీ పతనం ఖాయం.
గత ఎన్నికలకు ముందు జగన్ కు వాస్తవ పరిస్థితులు వివరించేందుకు కొందరు వైసీపీ నేతలు ప్రయత్నించినా..ఆయన పెడచెవిన పెట్టారన్న ఆరోపణలున్నాయి. అందుకే, ఇటు జగన్ ను, అటు జగన్ మెప్పు కోసం భజన చేసే ఓ వర్గాన్ని మేలుకొలిపేలా మేకపాటి ఈ కామెంట్లు చేసి ఉంటారు. మరి, మేకపాటి మంచి మాటను జగన్, ఆ భజన బ్యాచ్ ఫాలో అవుతారా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానమిస్తుంది.