పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరి సినిమాగా విజయ్ చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదలకు రెడీ అవుతోంది. ఇటీవలే మొదటి ఆడియో సింగల్ రిలీజైన సంగతి తెలిసిందే. విజువల్స్ చూశాక ఇది భగవంత్ కేసరి రీమేకనే అభిప్రాయం మరింత బలపడింది. ట్రైలర్ చూశాక పూర్తి క్లారిటీ వస్తుంది కానీ ప్రస్తుతానికి టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాక చివర్లో విజయ్ తో డబ్బింగ్ చెప్పించబోతున్నారు. నిర్మాణ సంస్థ కెవిఎన్ చాలా భారీ బడ్జెట్ పెట్టింది. అయితే ఒకవైపు హ్యాపీ ఇంకోవైపు బిపి తరహాలో ఈ మూవీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఫ్యాన్స్ చర్చకు దారి తీస్తున్నాయి.
ముందు హ్యాపీ సంగతి చూద్దాం. జన నాయకుడు ఓటిటి డీల్ అమెజాన్ ప్రైమ్ సుమారు 110 కోట్లకు లాక్ చేసిందని చెన్నై టాక్. ఇది చాలా పెద్ద మొత్తం. ఓవర్సీస్ నుంచి 80 కోట్లు, మ్యూజిక్ హక్కుల రూపంలో 35 కోట్లు, ఇతర భాషలు రాష్ట్రాల ద్వారా సమకూరే మొత్తం 55 కోట్లుగా చెబుతున్నారు. కేవలం తమిళనాడు థియేట్రికల్ రైట్స్ నుంచే నిర్మాత 100 కోట్లు ఆశిస్తున్నారట. మొత్తంగా చూసుకుంటే ఇవన్నీ జరిగితే నాలుగు వందల కోట్ల బిజినెస్ చేతిలో ఉన్నట్టే. అయితే బిపి దేనికంటే ఒకే డిస్ట్రిబ్యూటర్ కు హక్కులు అమ్మాలని చూస్తున్న నిర్మాతకు పంపిణీదారుల నుంచి సహకారం అందడం లేదని కోలీవుడ్ న్యూస్.
పొలిటికల్ వాతావరణం సున్నితంగా ఉన్న నేపథ్యంలో జన నాయకుడుకి అధికార పార్టీ లేదా ప్రత్యర్థులు ఏదైనా అడ్డంకి కలిగిస్తే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. పైగా సినిమాలో రాజకీయ విమర్శలు చాలానే ఉన్నాయట. అవి కనక సదరు టార్గెట్ చేసిన వ్యక్తులకు తగిలితే మటుకు కాంట్రావర్సీలు ఖాయం. అందుకే బయ్యర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు వినికిడి. ఒకరే కాకుండా విడివిడిగా ఏరియాల వారిగా కొందామని డిసైడ్ అయ్యారట. ఇదంతా కొలిక్కి రావడానికి ఇంకో నెల రోజులు పట్టేలా ఉంది. ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి అభిమానులకు మెసేజ్ ఇవ్వాలని చూస్తున్న విజయ్ కు ఈసారి అనుమతులు రావడం అంత ఈజీ కాదు.