చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి.. స్టార్ ఇమేజ్ సంపాదంచిన నటుడు సిద్ధు కరోనా టైంలో ఓటీటీలో రిలీజైన కృష్ణ అండ్ హిజ్ లీల అతడికి ఫస్ట్ బ్రేక్ ఇవ్వగా.. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లయి తన రేంజ్ పెంచాయి. కానీ టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చిన జాక్ మాత్రం పెద్ద డిజాస్టర్ అయి సిద్ధును తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ సినిమా మిగిల్చిన నష్టాల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరిగింది.
టిల్లు స్క్వేర్ వసూళ్లలో పదో వంతు కూడా ఈ సినిమాకు రాకపోవడం.. భారీ బడ్జెట్ సినిమాలను మించి దీనికి నష్టాలు రావడం గురించి చాలా రోజులు ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. సిద్ధును పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఒక నిర్మాత ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీని గురించి తాజాగా కొందరు జర్నలిస్టులతో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో సిద్ధు స్పందించాడు.
జాక్ సినిమా విషయంలో తనను కావాలనే టార్గెట్ చేశారని సిద్ధు అభిప్రాయపడ్డాడు. పనిగట్టుకుని తనను సెంటర్ చేసి నిందించే ప్రయత్నం జరిగిందని అతనన్నాడు. ఆ సమయంలో తాను బాధ పడ్డట్లు అతను చెప్పాడు. జాక్ సినిమా ఫెయిలయ్యాక తనను నిర్మాతలేమీ డబ్బులు అడగలేదని.. కానీ తనే ముందుకొచ్చి పారితోషకంలో కొంత భాగాన్ని (దాదాపు నాలుగన్నర కోట్లని వార్తలు వచ్చాయి) వెనక్కిచ్చినట్లు అతను వెల్లడించాడు. తాను ప్రశాంతంగా పడుకోవాలంటే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలి అనిపించి ఇచ్చినట్లు అతను చెప్పాడు.
ఎవరైనా స్టేజ్ మీద, ఇంటర్వ్యూల్లో కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే జనం తట్టుకోలేరని.. ఇలా చేస్తే యారొగెన్స్ అంటారని.. ఎప్పుడూ చేతులు కట్టుకుని, వినమ్రంగా ఉండాలని కోరుకుంటారని అతనన్నాడు. తాను స్క్రిప్టు రాయగలనని చెప్పినా అది కూడా యారొగెన్స్ లాగా చూస్తారని సిద్ధు ఆశ్చర్యపోయాడు. తాను రాసిన స్క్రిప్టు సక్సెస్ అవుతుందా లేదా అన్నది వేరే విషయమని.. కానీ ఒక సీన్ రాయడం, దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడం తనకు తెలుసని అతనన్నాడు. కానీ ఇలాంటివి చెబితే చాలామంది తట్టుకోలేరని సిద్ధు వ్యాఖ్యానించాడు.