కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కారు పేరెత్తితే చాలు.. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఒంటికాలిపై లేస్తారు. సోషల్ మీడియాలోనే కాక.. అనేక విషయాల్లో ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలే చేస్తుంటారు. తాజాగా జాతీయ అవార్డుల విషయంలో ఆయన కేంద్రం మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేషనల్ అవార్డ్స్ న్యాయబద్దంగా ఇవ్వట్లదేని.. పక్షపాతం ఉంటోందని.. అవార్డుల విషయంలో రాజీ పడుతున్నారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.
‘కశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ ఫైల్స్’ లాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వడాన్ని దుయ్యబడుతూ.. ‘‘ఈ మధ్య కొన్ని ఫైల్స్‌కు, పైల్స్’కు కూడా అవార్డులు ఇచ్చారు. అలాంటపుడు అవార్డులకు విలువేముంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలే ప్రకటించిన కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్‌లో ప్రకాష్ రాజ్ జ్యూరీ సభ్యుడు. ఈ అవార్డుల ప్రకటన సందర్భంగా ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు.
2024 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ పురస్కారాల్లో చాలా వరకు మంజుమ్మల్ బాయ్స్‌కు మెజారిటీ అవార్డులు దక్కాయి. ఐతే ఉత్తమ నటుడిగా మాత్రం లెజెండరీ నటుడు మమ్ముట్టి ఎంపికయ్యాడు. ‘భ్రమయుగం’ సినిమాలో అద్భుత నటనకు గాను ఆయనకీ అవార్డు దక్కింది. ఐతే ఈ సినిమాకు మమ్ముట్టి నేషనల్ అవార్డు కూడా గెలుస్తాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. కానీ దక్కలేదు.
దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. నేషనల్ అవార్డుల్లో కొన్నేళ్ల నుంచి పక్షపాతం ఉంటోందని.. అందుకే మమ్ముట్టికి అవార్డు ఇవ్వలేదని.. మమ్ముట్టిని వరించే అర్హత జాతీయ అవార్డులకే లేదని ఆయన విమర్శించారు. తనను కేరళ ప్రభుత్వం జ్యూరీ సభ్యుడిగా అడిగినపుడు.. తాము ఇందులో ఎంతమాత్రం జోక్యం చేసుకోమని.. పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పడంతోనే జ్యూరీలో భాగం అయ్యానని.. కానీ జాతీయ అవార్డుల్లో ఇలాంటి స్వేచ్ఛ ఉండట్లేదని ప్రకాష్ రాజ్ అన్నారు.