హైదరాబాద్‌లోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్. దీనికి త్వరలోనే ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ సందడి కొన్నాళ్ల కిందటే ప్రారంభమైంది. అయితే, ఎన్నికల ప్రక్రియ చేరువ అవుతున్న నేపథ్యంలో ఈ రాజకీయ సందడిమరింత దుమ్మురేపనుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అభ్యర్ధిని ప్రకటించడంతోపాటు, గల్లీ గల్లీకి బీఆర్‌ఎస్ నినాదంలో ప్రచారాన్ని కూడా ప్రారంభించనుంది. అంతేకాదు, ఎలా ముందుకు వెళ్లాలి, ఎలా విజయం దక్కించుకోవాలి, సెంటిమెంటును ఎలా ఒడిసి పట్టాలి? ఇలా అనేక విషయాలపై బీఆర్‌ఎస్ పెద్ద ప్లాన్ పెట్టుకుంది.
అయితే, అధికార పార్టీ కాంగ్రెస్‌లో మాత్రం జూబ్లీహిల్స్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పీఠం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఆయన దీనిపై స్పందించలేదు. మరోవైపు, అధిష్టానం దగ్గర ఆయన తన ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ అసెంబ్లీలోనే అడుగు పెట్టాలని అజార్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు, ఇతర నాయకులు కూడా చాలా మంది ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్న ప్రభాకర్ పదే పదే ఇక్కడ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. అయినా కొలిక్కి రావడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ముగ్గురు మంత్రులకు ఆయన బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్‌లో రాజకీయ పరిస్తితులు, పార్టీలో ఆశావహులు ఎవరు? ఎవరెవరు టికెట్ కోరుతున్నారు? వారి బ్యాక్‌గ్రౌండ్, ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునే స్థాయిలో ఎంత మంది ఉన్నారు? ప్రజల నాడి ఏంటి? బీఆర్‌ఎస్ హవా ఎలా ఉంది? ఆ పార్టీ అభ్యర్ధి మాగంటి సునీతకు సెంటిమెంటు కలిసి వచ్చే అవకాశం ఎంత? ఇలా మొత్తం 33 ప్రశ్నల జాబితాను వారికి అందించారు. ఆయా అంశాలపై సమగ్ర విచారణ చేసి, తనకు అందించాలని కూడా ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారమే అభ్యర్ధిని నిర్ణయించనున్నట్టు సీఎం తెలిపారు.
సాధ్యమేనా?
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి చిన్న నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా, పార్టీ అధిష్టానానికి చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు హైడ్రా ఏర్పాటుపై రాహుల్ గాంధీని ఒప్పించేందుకు తాను నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాంటిదే, కీలకమైన జూబ్లీహిల్స్‌పై ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అవుతుందా? అనేది ప్రశ్న. అయితే ప్రస్తుతం ఉన్న ఆశావహులను ఒక వైపు తీసుకువచ్చేందుకు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసేందుకు ఈ నివేదికలను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ స్ట్రాటజీ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.