హైదరాబాద్‌లోని కీలక అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీహిల్స్‌లో అన్ని వడబోతల తర్వాత.. 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. నిజానికి నామినేషన్ల గడువు ముగిసే సరికి 211 మంది అభ్యర్థులు నామి నేషన్లు దాఖలు చేశారు. ఆ మరుసటి రోజు చేపట్టిన స్క్రూటినీలో 81 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ధ్రువీకరించారు. అయితే.. ఇంత మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ప్రధాన పార్టీలైన బీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఖంగుతిన్నాయి. ఈ నేపథ్యంలో బరిలోకి దిగిన సీనియర్ నేతలు.. స్వతంత్రులను మచ్చిక చేసుకుని వారితో నామినేషన్లను ఉపసంహరించుకు నేలా చేశారు.
ఫలితంగా ప్రస్తుతం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టయింది. అయినప్పటికీ..జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత.. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీకి దిగడం అనేది ఇదే తొలిసారి అని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు.. ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో 13 మంది పోటీ చేశారు. ఆతర్వాత.. గత 2014 ఎన్నికల్లో 21 మంది బరిలో ఉన్నారు. ఇదే ఇప్పటి వరకు భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడిన ఎన్నిక. అయితే.. ఆ ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ టీడీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. ప్రస్తుతం జరుగుతున్న ఉప పోరులోనే 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు అయింది.
బీజేపీ, బీఆర్ ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నా.. ఈ ఉప పోరులో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలోకి దిగారు. వీరిలో రైతులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. కానీ, విద్యార్థి సంఘాల తరఫున బరిలో ఉన్న వారు మాత్రం ససేమిరా అనడంతో నామినేషన్ల సంఖ్య 58కి చేరిందని అధికారులు చెబుతున్నారు. ఇక, ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉద్రుతం చేశారు. స్వతంత్రులు కూడా ఇంటింటికీ తిరుగుతున్నారు. గత బీఆర్ ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు.
2 వేల మందికి పైగా పెరిగారు!
తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసింది. జూబ్లీహిల్స్‌లో చివరి సారి విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. ఇక, ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత.. కొత్తగా 2,383 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తాజాగా శుక్రవారం విడుదల చేసిన జాబితానే ఫైనల్ అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. దీని ప్రకారమే పోలింగ్ జరుగుతుందని తెలిపింది. కాగా.. నవంబరు 11న ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.