జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకున్న దరిమిలా సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని తాను ముందుగానే ఊహించానని చెప్పారు. “నేను ముందేచెప్పా.. బీఆర్ ఎస్ పార్టీ ఎప్పటికీ గెలవదు. ఏం చేశారని ప్రజలు ఓటేస్తారు.? అందుకే చెప్పా.. మీరు(బీఆర్ ఎస్) ఓడిపోతారు అన్నా.. ఇక, బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోద ని చెప్పా. ఇప్పుడు అదే జరిగింది. కానీ, నాపైనా.. మా అభ్యర్థి నవీన్‌పైనా ఫేక్ న్యూస్ రాయించారు. ఫేక్ ప్రచారం చేశారు. ఫేక్ సర్వేలతో తమదే గెలుపు అని వాపును బలుపుగా చూపించే ప్రయత్నం చేశారు. అహంకారం మంచిది కాదు. కేటీఆర్ ఇప్పటికైనా తన అహంకారం తగ్గించుకోవాలి.“ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
జూబ్లీ గెలుపు తమ ప్రభుత్వానికి మరింత బాధ్యతను పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. 2023లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించలేదన్న ఆయన.. ప్రభుత్వ రెండేళ్లపనితీరును పరిశీలించిన ప్రజలు.. మా ప్రభుత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే జూబ్లీహిల్స్‌లో విజయం కట్టబెట్టారని తెలిపారు. ఈ విజయంతో తమకు గర్వం పెరగదన్న సీఎం.. మరింత బాధ్యత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని కాపాడుకునే విధంగా మేం వ్యవహరిస్తామన్నారు. గెలుపు ఓటములు కాంగ్రెస్ పార్టీకి కొత్తకాదని తెలిపారు.
హైదరాబాద్ నగరం నుంచే 65 శాతం ఆదాయం వస్తోందని సీఎం చెప్పారు. దీనిని నగరం అభివృద్ధికే ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. హైడ్రా సహా మూసి నది ప్రక్షాళనకు ప్రజలు మద్దతుగా నిలిచారని రేవంత్ తెలిపారు. దీనిని ముందుకు తీసుకువెళ్తామన్నారు. హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్ది.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని ముందుగానే ఊహించానని రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం. అయితే.. ఇప్పుడు రాజకీయాలకు తావు లేదని.. ఎన్నికలు అయిపోయాయని.. నవీన్ యాదవ్ చెప్పినట్టు ఇప్పుడు అందరూ కలిసి నగరం, రాష్ట్రం అభివృద్ధికి కృషి చేద్దామని వ్యాఖ్యానించారు.
బీజేపీకి భూకంపం!
జూబ్లీహిల్స్ ఉప పోరులో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీకి భూకంపం అంటే ఎలా ఉంటుందో చూపించామన్నారు. భూకంపానికి వచ్చే ప్రకంపనలకే(ఉప పోరు) ఆ పార్టీ చిత్తుగా మారిందని.. ఇక, భూకంపమే వస్తే ఎలా ఉంటుందో ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలోచించుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ఎందుకు కొలాప్స్ అయిందో ఆయనే చెప్పాలన్నారు. గత ఎన్నికల్లో ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు 11 శాతానికి ఎందుకు పడిపోయిందో ఆలోచన చేయాలని సూచించారు.