జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుపై తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ఈ బైపోల్‌ను చాలా సీరియస్‌గా తీసుకుని ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా, బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆ ఉప ఎన్నిక ఫలితంపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలో ఎవరు గెలిచినా ప్రజలకు ఫరక్ పడదంటూ ఆమె చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజలకు ఫరక్ పడదని నమ్ముతున్నానని కవిత చెప్పారు. ఏ పార్టీ గెలుస్తుందో తెలీదని, ఏ పార్టీ గెలిచినా ఎమ్మెల్యేల సంఖ్యకు ఒకటి అదనంగా కలుస్తుంది తప్ప పెద్ద ఉపయోగం ఏమీ లేదని అన్నారు. పాలక, ప్రతిపక్షాలకు జూబ్లీహిల్స్‌లో 15 డేస్ ఎంటర్‌టైన్‌మెంట్ ముగిసిందని, ఎన్నిక పూర్తయ్యాక ఇప్పుడు వారంతా ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తారని అనుకుంటున్నానని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తన పాలనకు రిఫరెండం అని రేవంత్ రెడ్డి చెప్పారని, గెలిచినా ఓడినా ఆ బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకుంటారని తాను అనుకుంటున్నానని చెప్పారు.
నల్గొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కవిత విమర్శలు గుప్పించారు. తన పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను మున్సిపల్ అధికారులు తొలగించారని, తనకు కోమటిరెడ్డికి ఎలాంటి పంచాయతీ లేకపోయినా హోర్డింగ్‌లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్గొండలో ప్రజారోగ్యం బాగుండాలంటే ఏ టౌన్‌లో అయినా అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌లో బాగా పాపులర్ అని అన్నారు. నల్గొండ ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారో తెలీదని చురకలంటించారు.
భవిష్యత్తులో జనాభా పెరుగుతుందని, అప్పుడు పరిస్థితులు భయంకరంగా ఉంటాయని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి అన్న వెంటనే రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యపై ఫోకస్ చేయాలని కోరారు. అయితే, వేసిన రోడ్లు మళ్లీ వేశారని, అక్కడక్కడే తిప్పారని, డబ్బుల కోసం వేశారని చాలామంది ఫిర్యాదులు చేశారని, అవన్నీ తాను మాట్లాడదలుచుకోలేదంటూనే కోమటిరెడ్డిపై సెటైర్లు వేశారు.