జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటున్నారు. మాటకు మాట అన్నట్టుగా.. ప్రధాన ప్రత్యర్థి పార్టీలు బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లు.. విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ప్రచారంలో ఆయా పార్టీల కీలక నాయకులు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న హామీలపై ఇరు పక్షాలు.. పరస్పరం కౌంటర్ వేస్తున్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రెహమత్ నగర్‌లో పర్యటించారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.
అంతేకాదు.. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ సమస్యలను మంత్రి ప్రస్తావించారు. గత పదేళ్లలో బీఆర్ ఎస్ ఇక్కడిసమస్యలను పరి ష్కరించలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే.. వచ్చే మూడేళ్లలో ఈ నియజకవర్గంలోని సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్ ఎస్‌ను నమ్మవద్దని చెప్పారు. ఆ పార్టీ ప్రజలను నమ్మించిమోసం చేసిందన్నారు.
అయితే.. పొంగులేటి వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ నుంచి అంతే షార్ప్‌గా స్పందన వచ్చింది. వచ్చే మూడేళ్ల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పటి వరకు రెండేళ్లలో జూబ్లీహిల్స్‌కు ఏం చేశారో చెప్పాలని ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ప్రశ్నించారు. మాటలు చెప్పి.. మభ్యపుచ్చి ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వారి మాటలను విశ్వశించవద్దని ఆయన జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. అయితే.. బీఆర్ ఎస్ నేత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దీటుగా స్పందించింది.
బీఆర్ ఎస్‌లో కుటుంబ రాజకీయాలు సాగుతున్నాయని మంత్రులు వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేయబోరని.. వారి కుటుంబాలకు మేలు చేసుకుంటున్నారని.. నియోజకకవర్గం అభివృద్ధికి మాగంటి కుటుంబం ఏం చేసిందో చెప్పాలన్నారు. వారి ఆస్తులు పెరిగాయని.. జూబ్లీహిల్స్‌లో పేదవాడి ఆస్తులు కరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇలా .. ఒకరి వ్యాఖ్యలపై ఒకరు కౌంటర్ వేయడం.. ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటరు ఎటు వైపు మొగ్గు చూపుతాడన్నది చూడాలి.