విడుదల కోసం ఎదురు చూస్తున్న జననాగయన్ లాంటి భారీ చిత్రాన్ని ఆన్ లైన్లో లీక్ అయిపోవడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఈ రోజుల్లో సినిమాను మేకింగ్ దశలో, విడుదలకు ముందు ప్రొటెక్ట్ చేయడం ఎంత కష్టమో చెప్పడానికి ఇది ఉదాహరణ. సాంకేతికత రోజు రోజుకూ విస్తరిస్తున్న ఈ రోజుల్లో కంటెంట్‌ను భద్రపరచడం సవాలుగా మారుతోంది. ఎన్నో జాగ్రత్తలు, కఠిన నిబంధనల మధ్య షూట్ చేసే రాజమౌళి సైతం తన కొత్త చిత్రం వారణాసికి సంబంధించి లీక్స్ బెడద నుంచి తప్పించుకోలేకపోయాడు.
తాజాగా తమిళంలో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటనదగ్గ జైలర్-2 నుంచి ఒక కీలక సన్నివేశం లీక్ అయినట్లు సమాచారం. ఐతే జననాయగన్ సన్నివేశాల్లాగే అదేమీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వలేదు. లీక్‌ను త్వరగా గుర్తించి సోషల్ మీడియాలో ఎక్కడా కంటెంట్ లేకుండా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
జైలర్-2 షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మధ్యలో రిలీజయ్యే అవకాశముంది. ఐతే ఎడిటింగ్ విభాగం నుంచే ఎవరో ఒక కీలక సన్నివేశానికి సంబంధించిన ఫుటేజీని లీక్ చేసినట్లు చెబుతున్నారు.
సన్ పిక్చర్స్‌కు ప్రత్యేకంగా యాంటీ పైరసీ టీం ఉంది. వారిని రంగంలోకి దించి కంటెంట్‌ను వెంటనే కంట్రోల్ చేసినట్లు కోలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. జననాయగన్ అనుభవం నేపథ్యంలో సన్ పిక్చర్స్ ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలకపోవచ్చు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన జైలర్ మూవీ 2023లో విడుదలై 500 కోట్లమేర వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది.
ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న జైలర్-2 మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలోనూ మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలు కొనసాగనుండగా.. ఒక స్పెషల్ క్యామియో విషయంలో సస్పెన్స్ నడుస్తోంది. షారుఖ్ ఖాన్ నో చెప్పడంతో ఆ పాత్రలో ఇంకెవరు కనిపిస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.