“బెంగాల్‌లో నన్ను లక్ష్యంగా చేస్తే, నా ప్రజలపై దాడి వ్యక్తిగత దాడిగానే పరిగణిస్తాను. ఎన్నికల తర్వాత దేశం మొత్తం తిరుగుతూ పెద్ద ఎత్తున పోరాడుతాను,” అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ప్రభావం చూపుతోందని ఆరోపించిన మమతా, రాబోయే ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో అసలైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా బనగావ్ లో మంగళవారంనాడు భారీ ర్యాలీని నిర్వహించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మత ఆధారంగా దరఖాస్తులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంత హడావిడిగా చేపట్టటాన్ని మమతా తప్పుపట్టారు. హడావిడి వ్యవహారంతో ఓటర్ల జాబితా నుంచి ప్రజలను తప్పించాలని చూస్తే బీజేపీని విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.
మొన్న జరిగిన బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆమె మాట్లాడారు. అక్కడ ఓటర్ల జాబితా సవరణ ఫలితంగానే ఎన్డీయే విజయం సాధించిందని ఆరోపించారు. బీజేపీ ‘గేమ్’ను అర్థం చేసుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని అన్నారు. డూప్లికేట్ ఓటర్లను సృష్టించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వాడుతున్నారని, ఇది బీజేపీ ప్లాన్ అని ఆరోపించారు.
బెంగాల్‌లో బీజేపీ ఆటలు సాగవు అన్నారు. తాను ఇక్కడ ఉన్నంత వరకూ ప్రజలను ఓటర్ల జాబితా నుంచి ఎవరూ తప్పించలేరని స్పష్టం చేశారు. రాజకీయంగా బీజేపీ తనతో పోరాడలేదని, తనను ఓడించడం వారికి అసాధ్యమని బెంగాల్ సీఎం స్పష్టం చేశారు.