సీఎం చంద్రబాబు లక్ష్యం ఎప్పటికప్పుడు పదును పెరుగుతోంది. రోజురోజుకు ఆయన తన లక్ష్యాలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా విశాఖ పట్నంపై మరిన్ని ఆశలు, ఆశయాలతో సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గతంలో వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్.. విశాఖను రాజధానిని చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఎంత లేదన్నా.. చాలా మంది ఈ ప్రకటనను స్వాగతించారు. తమ నగరం బాగుపడుతుందని కూడా అనుకున్నారు.
ఈ క్రమంలో అదేస్థాయిలో సీఎం చంద్రబాబు కూడా ఆలోచన చేస్తున్నారు. జగన్ ఉంటే.. విశాఖ బాగుండేది అనే మాట వినిపించకుండా చేసేందుకు ఎప్పటికప్పుడు విశాఖ నగరాన్ని అద్భుతంగా తీర్చి దిద్దేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా `టార్గెట్ 2028 @ విశాఖ` అంశాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అంటే.. 2028 నాటికి విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాల న్నది ఆయన ప్రణాళిక. దీనిలో భాగంగా కేవలం పెట్టుబడులకే పరిమితం కాబోరన్నది స్పష్టం అవుతోంది.
విశాఖను రాబోయే రోజుల్లో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఐటీ సహా పర్యాటకం, పారిశ్రామికంగా కూడా నగరాన్ని తీర్చి దిద్దేందుకు నడుం బిగించారు. తద్వారా 2028 నాటికి బెస్ట్ సిటీగా విశాఖను మార్చనున్నారు. ముఖ్యంగా ఐటీ, పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇవ్వ నున్నారు. 2028 నాటికి ఐటీలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. అదేవిధంగా ఆర్సెలార్ మిట్టల్ ద్వారా అనకాపల్లిలో భారీ ఐరన్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా రైడెన్ సంస్థకు అనుమతులు ఇచ్చారు. ఈ సంస్థ 87 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో ఇన్ఫోటెక్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. తద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక, ఇప్పటికే పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖలో పర్యాటక బస్సులను కూడా ప్రారంభించారు. త్వరలోనే సీ కేబుల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాన్నారు. తద్వారా.. మరింతగా విశాఖ అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.