ముందే వస్తుందని తెలిసి, తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేసినా సరే మొంథా తుఫాను ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వడం లేదు. విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలు భయంతో వణికిపోతున్నాయి. ఈ రెండు మూడు రోజులు దీని ఉదృతి కొనసాగవచ్చనే అంచనాల నేపథ్యంలో చాలా చోట్ల స్కూళ్ళు, కాలేజీలతో పాటు థియేటర్లు కూడా మూసివేస్తున్నట్టు సమాచారం. ఎలాగూ దీపావళి హడావిడి అయిపోయింది. కె ర్యాంప్ బాగా నెమ్మదించింది. తెలుసు కదా, డ్యూడ్ ఫైనల్ రన్ కు చేరుకోగా కాంతారా ఛాపర్ 1 ఏ లెజెండ్ ఇంకో రెండు రోజుల్లో ఓటిటి స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉండగా మొంథా ప్రభావం టాలీవుడ్ బాక్సాఫీస్ మీద ఎంత స్థాయిలో ఉంటుందనేది బయ్యర్లు అప్పుడే అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే అక్టోబర్ 31 రిలీజయ్యే మాస్ జాతర, బాహుబలి ది ఎపిక్ మీద ఎగ్జిబిటర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. బుకింగ్స్ కూడా దానికి తగ్గట్టే భారీగా జరుగుతున్నాయి. మొంథా ఎఫెక్ట్ తెలంగాణ మీద పెద్దగా లేదు కానీ కీలకమైన ఏపీ అందులోనూ రెవిన్యూ పరంగా ప్రధాన పాత్ర పోషించే ఉత్తరాంధ్రకు వరద ముప్పు ఉండటంతో జనం థియేటర్లకు వచ్చే మూడ్ లో అస్సలు ఉండరు. ఉండటానికి గూడే కష్టమైనప్పుడు ఎంటర్ టైన్మెంట్ ఎవరు కోరుకుంటారు.
శుక్రవారానికి మొంథా తగ్గుముఖం పట్టే సూచనలు ఉండటం కొంచెం రిలీఫ్ కలిగించే విషయం. ఒకవేళ మాస్ జాతర కనక హిట్ టాక్ తెచ్చుకుంటే తర్వాత మెల్లగా నిలబడిపోతుంది. రవితేజ ఇమేజ్ దృష్ట్యా పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు క్రమంగా ఊపందుకుంటాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కొంచెం నెమ్మదిగా ఉన్నా తర్వాత పికప్ ఆశించవచ్చు. కాకపోతే మొంథా తీవ్రత ఎంత మోతాదులో ఉంటుందనేది కీలకం కానుంది. ఇప్పటికైతే జరగరానిది ఏదీ జరగలేదు కాబట్టి ఇకపై కూడా ఇదే స్థితి కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. జన జీవనానికే కాదు టాలీవుడ్ బాక్సాఫీసుకు కూడా అదే మంచిది.