hyderabadupdates.com movies టాలెంటెడ్ దర్శకుడిని వృథా చేస్తున్నారా

టాలెంటెడ్ దర్శకుడిని వృథా చేస్తున్నారా

స్టార్ డైరెక్టర్లు హీరోలు కావాలనుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ కెరీర్ కనక అనుకున్న దిశగా వెళ్లకపోతే దశను  మార్చుకునే హక్కు అందరికీ ఉంటుంది. అయితే మన స్థాయి, అభిమానుల్లో నమ్మకం ఎలాంటివో గుర్తు పెట్టుకోవాలి. పాతిక సంవత్సరాల క్రితం ఎస్వి కృష్ణారెడ్డి మంచి ఫామ్ లో ఉన్నారు. రాజేంద్రప్రసాద్, అలీ లాంటి హీరోలతో ఇండస్ట్రీ హిట్లు కొడుతున్న టైం అది. ఆ సమయంలో తన హీరో జిజ్ఞాసను తీర్చుకోవడం కోసం ఉగాది, అభిషేకంలో కథానాయకుడిగా మేకప్ వేసుకున్నారు. కట్ చేస్తే రెండూ ఫ్లాప్ అయ్యాయి. మళ్ళీ ఆయన కానీ ఇతర నిర్మాతలు కానీ హీరోగా పెట్టే సాహసం చేయలేకపోయారు.

కొన్నేళ్ల క్రితం వివి వినాయక్ ని హీరోగా పెట్టి నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో శీనయ్య అనే ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. అది రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లకుండానే ఆగిపోయింది. పూరి జగన్నాథ్ ని హీరో చేద్దామని అడిగిన వాళ్ళు ఉన్నారు. రాజమౌళి ఎస్ అనే స్థితిలో ఉంటే ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు ఎంత ఖర్చయినా ఆయన మీద పెట్టేందుకు సిద్ధంగా ఉండేవాళ్ళు. అలాని అందరూ ఫెయిలవుతారని కాదు. దాసరి నారాయణరావు, భాగ్యరాజా, రవిచంద్రన్, ఆర్ నారాయణమూర్తి, స్వర్గీయ ఎన్టీఆర్, కృష్ణ తదితరులు రెండు పడవల ప్రయాణాన్ని అద్భుతంగా నడిపించిన వాళ్ళే. కానీ అప్పటి పరిస్థితులు వేరు.

ఇప్పుడీ టాపిక్ ప్రస్తావనకు కారణం లోకేష్ కనగరాజ్. తనను హీరోగా పెట్టి సన్ పిక్చర్స్ DC అనే భారీ చిత్రాన్ని ప్రకటించింది. వామికా గబ్బి హీరోయిన్. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకుడు. చిన్న టీజర్ తో ప్రాజెక్టుని ఇవాళే లాంచ్ చేశారు. దేవదాసు అనే యువకుడు చంద్ర అనే వేశ్యతో ప్రేమలో పడితే జరిగే పరిణామాల చుట్టూ కథను అల్లుకున్నట్టుగా క్లూ ఇచ్చారు. అనిరుద్ రవిచందర్ దీనికి సంగీతం సమకూర్చబోవడం విశేషం. అంతా బాగానే ఉంది కానీ మంచి స్టార్ డం ఉన్న దర్శకుడిగా కెరీర్ లో ఉచ్చ స్థితిని చూస్తున్న స్టేజిలో లోకేష్ కనగరాజ్ ఇలా డైవర్ట్ కావడం మెజారిటీ మూవీ లవర్స్ కు హ్యాపీ అనిపించడం లేదు.

Related Post