సాధారణంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులకు సర్కారు నుంచి అభయం ఉంటుంది. ఇది సహజం. ఎక్కడైనా ఎవరైనా తప్పులు చేసినా.. పార్టీ ప్రభుత్వమే కాబట్టి వెనుకేసుకు వస్తుంది. అయితే.. ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోంది. తప్పు చేసిన వారు తన వారే అయినా.. అరెస్టుకు వెనుకాడడం లేదు. చర్యలకు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ లిక్కర్ కేసులో జయచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ వెంటనే ఆయనపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాదు.. పార్టీ బాధ్యతలను కూడా తప్పించారు. దీంతో జయచంద్రారెడ్డి స్థానికంగా అదృశ్యమయ్యారు. తాజాగా ఈ కేసులో జయచంద్రారెడ్డి పీఏ.. సతీష్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. 24 గంటల్లో జయచంద్రారెడ్డిని కూడా బెంగళూరు లో అరెస్టు చేశారు.
వైసీపీ హయాం నుంచే జరిగిన నకిలీ మద్యం కేసు.. ఇటీవల వెలుగు చూసింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకలచెరువు ప్రాంతంలో తయారీ కేంద్రాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఈ కేసులో వైసీపీకి చెందిన జోగి రమేష్ బ్రదర్స్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు కూడా జైల్లోనే ఉన్నారు. తాజా అరెస్టుతో దాదాపు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిని అరెస్టు చేసినట్టు అయింది.
చంద్రబాబు ఏమన్నారు?
జయచంద్రారెడ్డి అరెస్టు జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. పార్టీ నాయకులు ప్రజల సేవకు ఉపయోగపడాలి కానీ.. అక్రమార్కులతో చేతులు కలిపి.. ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి రారాదని స్పష్టం చేశారు. చట్టం ప్రకారం జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మరో సారి పోలీసులకు ఆయన సూచించారు.