రాజకీయాల్లో టైమింగ్‌కు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కీలకమైన ఎన్నికల సమయంలో అనూహ్యంగా అయిన వారు రంగంలోకి దిగి రాజకీయ విమర్శలు చేస్తే ఎలా ఉంటుందో ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
వైసీపీ అధినేత జగన్ ఇద్దరు సోదరీమణులు సునీత, శర్మిల ఎన్ని కల సమయంలో విజృంభించారు. దీంతో వైసీపీ ఓటమికి వీరు కూడా కలిసి వచ్చారన్న వాదన ఉంది.
ఇక ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణలోనూ కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగుస్తున్న సమయంలో అనూహ్యంగా బీఆర్‌ఎస్ మాజీ నాయకురాలు కవిత ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఆమె కొత్తగా చేసిన వ్యాఖ్యలు ఏమీ లేకపోయినా కొత్తగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా “అధికారం శాశ్వతం అనుకునే వాళ్లను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు” అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అదే సమయంలో మరో కీలక వ్యాఖ్యను కూడా చేశారు. తనను కనీసం వివరణ కూడా అడగకుండానే పార్టీ నుంచి బయటకు పంపారంటూ మహిళలంటే ఈ పార్టీకి విలువలేదన్న సంకేతాలను పంపించారు.
దీనిలో ఎలాంటి దాపరికం లేదు. వాస్తవానికి ఈ విమర్శలన్నీ కవిత ఇప్పుడే కాదు, తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర ప్రారంభించినప్పుడే చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా హనుమకొండలో ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చి ఈ వ్యాఖ్యలను మరింత బలంగా చేయడం వెనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైమ్ ఉందన్న చర్చ సాగుతోంది.
ఒకవైపు జూబ్లీహిల్స్‌పై కోటి ఆశలు పెట్టుకున్న కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు కవిత వ్యాఖ్యలు డ్యామేజీ అవుతాయా అవవా అనేది ఇప్పుడే తేలకపోయినా, ఆమె చేసిన వ్యాఖ్యల అంతరార్థం మాత్రం ఖచ్చితంగా ఇదేనన్నది బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చెబుతున్న మాట.
మరి ఇంత జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉంటారా? భవిష్యత్తులో మరింతగా రాజకీయం చేస్తానంటున్న కవితను చూస్తూ ఊరుకుంటారా? అంటే ఏం చేసినా ఇంటి ఆడబిడ్డపై ప్రతీకారం చేస్తున్నారన్న వాదన బలపడే అవకాశం ఉంది.
దీనిని ఆమె మరింత ఎక్కువ సెంటిమెంట్‌గా వాడుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కేసీఆర్‌కు ఇప్పుడు కాలు ఎటు కదిపినా అరటాకు ముల్లు సామెతగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.