ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జాతీయ రాజకీయాల్లో తిరుగులేదు. గత మూడు సార్లుగా ఆయన విజయం దక్కించుకుంటున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయనను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే.. తటస్థంగా ఉండే రాజకీయ పార్టీల నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లోనూ మోడీని మెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఎలానూ ఎన్డీయే సర్కారే ఉంది. సో.. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు.
అయితే.. గతంలో 2014-19 మధ్య కంటే ఇప్పుడు ఎక్కువగా సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీ విషయంలో అనుసరిస్తున్న తీరు.. ఆయనను ఆహ్వానిస్తూ.. కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు.. మోడీని ఒకింత ఆకట్టు కుంటోదన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఐదేళ్ల పాలనలో కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే మోడీని రాష్ట్రానికి ఆహ్వానించారు. కానీ, ఈ దఫా తొలి 16 మాసాల్లోనే ఐదు సార్లు మోడీని ఏపీకి ఆహ్వానించడం ద్వారా.. ఆయనను పలు మార్లు ప్రశంసించడం ద్వారా మోడీని అమితంగా ఆకట్టుకున్నారని.. విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ తరహా పరిస్థితి జగన్ విషయంలో కనిపించలేదు. జగన్ హయాంలోనూ మోడీ రెండు సార్లు ఏపీకి వచ్చారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఒకసారి.. కర్నూలుకు మరోసారి వచ్చారు. అయితే.. అప్పట్లో మోడీని ప్రశంసించకుండా కేవలం సమస్యలను ప్రస్తావించారు. ఇది రాష్ట్రానికి పెద్దగా మేలు చేయకపోయినా.. జగన్‌కు అసలు ఏమాత్రం కలిసి రాలేదని అంటారు. ఈ పరిణామంతో మోడీ దగ్గర జగన్ మార్కులు వేయించుకోలేక పోయారు. వాస్తవానికి.. మోడీతీసుకున్న అనేక నిర్ణయాలకు జగన్ సపోర్టు చేశారు.
కానీ, ఆయన దగ్గర చంద్రబాబు దక్కించుకున్న మార్కుల్లో సగం కూడా జగన్ తెచ్చుకోలేకపోయారు. తాజాగా జరిగిన కర్నూలు సభలో మోడీ పదే పదే చంద్రబాబును ప్రశంసించారు. విజన్ ఉన్న నాయకుడు అంటూ.. 4 సార్లు చెప్పారు. మంచి నాయకత్వం అంటూ.. 8 సార్లు చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో ఇలా ఒక్కసారి కూడా ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. అయితే.. ప్రస్తుతం కేంద్రంలో తన ప్రభుత్వం నిలబడడం వెనుక చంద్రబాబు ఉన్న కారణం కూడా దీనికి దోహదపడిందన్న వాదనున్నా.. మోడీ మనసును మాత్రం చంద్రబాబు గెలుచుకున్నారన్న వాదనే బలంగా వినిపిస్తుండడం గమనార్హం.