బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఢిల్లీ మద్యం కేసులో స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు సరైన ఆధారాలు చూపలేక పోయాయని పేర్కొంటూ.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా 22 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. వీరిలో కవిత కూడా ఉన్నారు. నాడు దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో కవిత అరెస్టు కావడం.. ఆమెను జైల్లో కూడా ఉంచడం తెలిసిందే.
కవిత ఏం చేశారు.
ఢిల్లీలో 2020లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం 2021 నవంబరులో కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం ప్రకారం ప్రభుత్వం అప్పటి వరకు చేస్తున్న లిక్కర్ రిటైల్ వ్యాపారాన్ని(వైన్స్ దుకాణాల ద్వారా) ప్రైవేట్ లైసెన్స్ దారులకు అప్పగించింది. దీనిని ఎవరైనా నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
ఈ క్రమంలోనే కవిత ఎంట్రీ ఇచ్చారు. `సౌత్ గ్రూప్` పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మాగుంట రాఘవరెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, పి. శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, గోరంట్ల బుచ్చిబాబు, రాజేష్ జోషిలతో కలిసి ఈ గ్రూపును ఆమె ఏర్పాటు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఢిల్లీలో ఒక ప్రాంతాన్ని వీరు దక్కించుకుని మద్యం వ్యాపారం ప్రారంభించారు. అయితే.. లైసెన్సు ఫీజులను ఎత్తి వేయడం, లేదా తగ్గించడం అనే విధానాలు కొత్త పాలసీలో ఉండడంతో కవిత పై స్థాయిలో చక్రం తిప్పి.. సౌత్ గ్రైప్‌నకు అసలు లైసెన్సు ఫీజులు లేకుండా చేసుకున్నారు. ఈ క్రమంలోనే 100 కోట్ల రూపాయలను ఆమె సౌత్ గ్రూప్ తరఫున.. గోవాలోని ఆప్ నేతలకు దొడ్డిదారిలో అందించారని.. వారు అప్పటి ఎన్నికల్లో ఆ సొమ్మును ఖర్చు చేశారని ప్రధాన అభియోగం.
ఈ 100 కోట్ల రూపాయలను మాగుంట రాఘవరెడ్డి ఖాతాకు కొంత, అభిషేక్ బోయినపల్లికి కొంత సమకూర్చారని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో పీ. శరత్ చంద్రారెడ్డి కవితకు గైడ్ చేశారన్న అభియోగం ఉంది. ఇవన్నీ వెలుగు చూసిన తర్వాత.. కవిత ఏకంగా 32 సెల్ ఫోన్లను, వాటిలోని డేటాను కూడా ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. ఆమెను అరెస్టు చేయడం.. పదే పదే విచారించడం.. జైల్లో పెట్టడం సంచలనం సృష్టించాయి. అయితే.. వీటికి సరైన ఆధారాలు లేవంటూ.. తాజాగా ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు తోసిపుచ్చింది.
బిగ్ బూస్ట్!
ప్రస్తుతం కవితపై ఉన్న ప్రధాన ఆరోపణ.. లిక్కర్ కేసే. ఆమెను తరచుగా ప్రత్యర్థులు ఈ కేసును అడ్డు పెట్టుకునే విమర్శలు గుప్పిస్తున్నారు. `కేసీఆర్‌ది ఫామ్ హౌస్-కవితది లిక్కర్ హౌస్` అంటూ ఒకానొక సందర్భంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు కూడా ఇచ్చారు. అయితే.. తాజాగా ఈ కేసులో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కవితకు బిగ్ బూస్టేనని పరిశీలకులు చెబుతున్నారు.
సొంతగా పార్టీ పెట్టుకుని ప్రజల మధ్యకు వెళ్లేందుకు ఆమె రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆమెను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు లిక్కర్ కేసు లేకపోవడం.. కలిసి వస్తున్న అంశంగా చెబుతున్నారు. దీనిని కవిత కూడా చెప్పుకొచ్చారు. ఇకతనకు ఎదురులేదని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.