hyderabadupdates.com movies డీప్ ఫేక్…. నో ఫిక‌ర్‌.. నేనూ బాధితుడినే: చిరంజీవి

డీప్ ఫేక్…. నో ఫిక‌ర్‌.. నేనూ బాధితుడినే: చిరంజీవి

డీప్ ఫేక్ వీడియోల వ్య‌వ‌హారం.. స‌మాజంలో తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎప్పుడు ఎవ‌రిని టార్గెట్ చేస్తారో.. ఎప్పుడు ఎలాంటి వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తాయో అని సెల‌బ్రిటీల నుంచి అనేక మంది ప్ర‌ముఖుల వ‌ర‌కు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ ఉంటారు. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. డీప్ ఫేక్ విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న‌, భ‌యం చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. తాను కూడా డీప్ ఫేక్ బాధితుడినేన‌ని చెప్పారు.

అయితే.. ఈ విష‌యంపై తాను ఉన్న‌తాధికారుల‌ను క‌లిసి వివ‌రించాన‌ని చిరంజీవి తెలిపారు. రాష్ట్ర డీజీపీ స‌హా.. హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్‌ల‌తో తాను మాట్లాడాన‌ని.. డీప్ ఫేక్‌ల విష‌యంలో వారు చాలా అప్ర‌మ‌త్తంగా ఉన్నార‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చిరు చెప్పారు. “ఇటీవ‌ల కాలంలో డీప్ ఫేక్ ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. దీనిపై నేను కూడా మాట్లాడాను. ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం ఇచ్చాను. ఎవ‌రూ ఆందోళ‌న చెందొద్దు” అని ఆయ‌న సూచించారు.

టెక్నాల‌జీని మంచి కోసం వినియోగించుకోవాల‌ని చిరంజీవి సూచించారు. ఇప్ప‌టికే ప‌లు కేసులు పెండింగులో ఉన్నాయ‌ని.. వాటిని స‌జ్జ‌నార్‌.. స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని చెప్పారు. ఎవ‌రూ అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌న్నారు. పోలీసు వ్య‌వ‌స్థ చాలా బలంగా ఉంద‌ని తెలిపారు కాగా.. శుక్ర‌వారం భార‌త మాజీ ఉప ప్ర‌ధాని, ఉక్కుమ‌నిషి స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ 150వ జయంతి. దీనిని పుర‌స్క‌రించుకుని దేశ‌వ్యాప్తంగా ఐక్య‌తా ప‌రుగు నిర్వ‌హించాలని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం ఉద‌యం నిర్వ‌హించిన ఐక్య‌తా ప‌రుగులో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. డీప్ ఫేక్ అంశాన్ని ప్ర‌స్తావించారు. ఇటీవ‌ల కాలంలో డీప్ ఫేక్ వీడియోలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీంతో ఆత్మ‌హ‌త్య‌లు కూడా పెరుగుతున్నాయి. ఇటీవ‌ల ఓ విద్యార్థి.. త‌న సోద‌రీమ‌ణుల డీప్ ఫేక్ వీడియోలు నిజ‌మ‌ని భావించి.. అవ‌మానంతో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే చిరు వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

Related Post