తన పాత సినిమాల పాటలు కొన్ని సెకన్ల పాటు ఏదైనా సినిమాలో వినిపించినా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అస్సలు ఊరుకోవడం లేదు. వెంటనే నోటీసులు ఇవ్వడం, కోర్టులో కేసులు వేయడం చేస్తున్నారు. గత కొన్నేళ్లలో మేస్ట్రో ఇలా పదుల సంఖ్యలో సినిమాలకు నోటీసులు పంపారు. కొన్ని చిత్రాల మేకర్స్ ఆయనకు నష్టపరిహారం కూడా అందించారు. ఈ ఏడాది తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన అజిత్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీంకు కూడా ఆయన నోటీసులు ఇవ్వడం తెలిసిందే.
ఈ చిత్రాన్ని నిర్మించింది తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఆ వివాదం గురించి తమ కొత్త సినిమా ‘డ్యూడ్’ ప్రెస్ మీట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడారు. తాము సోనీ ఆడియో సంస్థకు డబ్బులిచ్చే ఆయా పాటల హక్కులు తీసుకున్నామని.. ఇళయరాజా కేసు వేసింది సోనీ మీద అని, అది వేరే ఇష్యూ అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
కట్ చేస్తే ఇప్పుడు ‘డ్యూడ్’కూ ఇళయరాజా నుంచి ఇబ్బందులు తప్పట్లేదు. ఈ సినిమాలో తన పాటలు రెండు వాడారంటూ ఆయన టీంకు నోటీసులు పంపారు. ఈ సినిమాలో ఇళయరాజా పాటలను అక్కడక్కడా బ్యాగ్రౌండ్లో వాడారు. అవి కొన్ని సెకన్ల పాటే ఉంటాయి. అయినా ఆయన ఊరుకోవట్లేదు. తన మీద అభిమానంతో ఎవరైనా పాటలు వాడినా ఇళయరాజా నోటీసులు పంపుతున్నారు.
పాట మీద సంగీత దర్శకుడిదే తొలి హక్కు అని.. కానీ ఆడియో సంస్థలు నిర్మాతలకు డబ్బులిచ్చి హక్కులు తీసుకుని దశాబ్దాల తరబడి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నారని.. సంగీత దర్శకుడికి రాయల్టీ ఇవ్వట్లేదని.. ఇదేం న్యాయమని ఇళయరాజా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ సినిమాలో ఏ రకంగా తన పాటలను వాడుకున్నా ఆయన ఊరుకోవట్లేదు. ‘డ్యూడ్’కు కూడా అలాగే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.