hyderabadupdates.com movies డేటా ఆధారంగానే… ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం

డేటా ఆధారంగానే… ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం

బీహార్ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కూటమి అయిన రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఒక సంచలన ప్రకటన చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో కచ్చితంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకొస్తామని, 20 నెలల్లో ఈ హామీని పూర్తి చేస్తామని తేజస్వీ స్పష్టం చేశారు.

“బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని ఇల్లు అంటూ ఉండదు” అని ఆయన మీడియాతో చెప్పడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “ఈరోజు మేము చారిత్రక ప్రకటన చేయబోతున్నాం. బీహార్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో చాలా మంది తెలుసుకోవాలనుకున్నారు. 20 ఏళ్లుగా ఉన్న ఈ ప్రభుత్వం నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని ఎప్పుడూ గుర్తించలేదు” అని తేజస్వీ యాదవ్ అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు.

పాలక కూటమి అయిన జేడీయూ, బీజేపీలు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, కేవలం నిరుద్యోగ భృతిని మాత్రమే హామీ ఇస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తమ హామీని ఎవరూ కేవలం ఉత్తి మాటలు అనుకోవద్దని, ఇది సాధ్యమేనని తేజస్వీ ధీమా వ్యక్తం చేశారు. తాము ఈ హామీని పక్కా డేటా ఆధారంగానే ఇస్తున్నామని తేజస్వీ యాదవ్ తెలిపారు. “ప్రభుత్వ ఉద్యోగం లేని బీహార్ కుటుంబానికి కొత్త చట్టం ద్వారా ఉద్యోగం ఇస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోనే ఈ చట్టాన్ని తీసుకొస్తాం. ఆ తర్వాత 20 నెలల్లోనే ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండేలా చూస్తాం” అని ఆయన డెడ్‌లైన్‌తో సహా వివరించారు.

ఈసారి బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తమ పార్టీ సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా చేస్తుందని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు నవంబర్ 6, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక మరోవైపు, ఈ ఎన్నికల సమయంలో అధికార కూటమి (ఎన్డీఏ) కొత్తగా ఎలాంటి హామీలు ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి) అమల్లో ఉంది. ఈ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న తేజస్వీ యాదవ్ ఇలాంటి భారీ హామీని ప్రకటించడం రాజకీయంగా అధికార పార్టీని ఇరుకున పెడుతోంది. తమ పార్టీ ప్రకటించిన అంశాలను కూడా వాళ్లు కాపీ కొడుతున్నారని తేజస్వీ ఆరోపించారు. ఇక, యువతను, నిరుద్యోగులను ఈ హామీ ఎంతవరకు ఆకర్షిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Related Post