పేరుకి తమిళ హీరోనే అయినా ప్రదీప్ రంగనాథన్ మన యూత్ కి క్రమంగా దగ్గరవుతున్నాడు. లవ్ టుడే, డ్రాగన్ రెండూ కమర్షియల్ గా సక్సెస్ సాధించడమే దానికి నిదర్శనం. చూసేందుకు పక్కింటి కుర్రాడిలా అనిపించే ఈ యంగ్ టాలెంట్ ఈ వారం డ్యూడ్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ కావడంతో తెలుగు ప్రమోషన్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అడిగిన చోటికల్లా నో అనకుండా వెళ్తున్న ప్రదీప్ తాజాగా బిగ్ బాస్ 9కు గెస్టుగా వెళ్ళాడు. అక్కడ నాగార్జునతో తన హెయిర్ స్టయిల్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ పంచుకున్నాడు.
ప్రదీప్ రంగనాథన్ చిన్నప్పుడు రచ్చగన్ ( రక్షకుడు) చూశాక అచ్చం నాగార్జున పెంచినట్టు ఫంక్ హెయిర్ స్టైల్ కావాలని అదే పనిగా నెలల తరబడి కటింగ్ చేసుకోకుండా ఉండిపోయాడు. సరిపడా జుత్తు వచ్చిందని అర్థమయ్యాక సెలూన్ కి వెళ్లి అచ్చం నాగ్ తరహాలో కట్ చేయమని చెప్పి వెనుక జులపాలను అలాగే ఉంచుకున్నాడు. ఈ అవతారం చూసిన తల్లి ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఒక్క రోజు స్కూల్ లో చూపించి వస్తానని పర్మిషన్ తీసుకుని తర్వాత అమ్మ మాట ప్రకారం రెగ్యులర్ స్టయిల్ లోకి వచ్చేశాడు. కాలేజీలో చేరాక మళ్ళీ ఆ ముచ్చట తీర్చుకుని రచ్చగన్ గా మారిపోయాడు.
ఇదంతా ప్రదీప్ రంగనాథన్ స్వయంగా పంచుకున్నాడు. నిజానికి రక్షకుడు పెద్ద ఫ్లాప్ మూవీ. ఏఆర్ రెహమాన్ పాటలు తప్ప అప్పట్లో జనాన్ని మెప్పించే అంశాలు లేక నిర్మాత కెటి కుంజుమోన్ ని తీవ్ర నష్టాల పాలు చేసింది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు మనం సలార్, సాహో, ఓజిలకు చూసిన హైప్ ని అప్పట్లోనే రక్షకుడు ఎంజాయ్ చేసింది. సరే బొమ్మ పోతే పోయింది కానీ నాగార్జున పలు విషయాల్లో ఇలా స్ఫూర్తిగా నిలవడం విశేషం. రక్షకుడు చూశాకే నాగ్ మీద అభిమానం పెరిగిందని చెప్పిన లోకేష్ కనగరాజ్ తన కూలీలో నాగార్జునకు అదే తరహా స్టయిలింగ్ డిజైన్ చేసుకోవడం గమనించాల్సిన విషయం.