ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. ఏక్యూఐ 359తో ప్రమాదకర స్థాయికి చేరగా, అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్యం పెరగడంతో కేంద్రం జీఆర్ పీఏ స్టేజ్-4 చర్యలను స్టేజ్-3లోనే అమలు చేయాలని సూచించింది. ప్రైవేట్ ఆఫీసులు 50 శాతం సిబ్బందితో పనిచేయాలి, మిగతావారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఏక్యూఐ.. ఆనంద్ విహార్ లో 422, అశోక్ విహార్ లో 403, బావనలో 419, నోయిడా సెక్టార్ లో 125 – 434 ఉంది.
తీవ్ర కాలుష్యం కారణంగా పాఠశాలలకు ఆరుబయట కార్యక్రమాలు నిలిపేయాలని సూచనలు జారీ అయ్యాయి. వచ్చే వారంలో తీవ్ర ప్రమాదకర స్థాయిలోనే గాలి నాణ్యతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. గాలి కదలికలు సరిగ్గా లేకపోవడం, శీతాకాలం కారణంగా గాలి నాణ్యతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వ్యక్తులు, వృద్ధులతోపాటూ చిన్నారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాయు కాలుష్యం కారణంగా ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కళ్ళ మంటలు వంటి వాటికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.