hyderabadupdates.com movies ఢిల్లీ బ్లాస్ట్: మెయిల్ పంపకుండానే సీక్రెట్ చాటింగ్!

ఢిల్లీ బ్లాస్ట్: మెయిల్ పంపకుండానే సీక్రెట్ చాటింగ్!

ఢిల్లీ ఎర్రకోట వద్ద 13 మందిని బలితీసుకున్న కారు బాంబు పేలుడు కేసులో దర్యాప్తు సంస్థలకు మైండ్ బ్లాంక్ చేసే విషయాలు తెలుస్తున్నాయి. ఈ దారుణానికి ఒడిగట్టింది సామాన్య అనుమానితులు కాదు, ఏకంగా ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లు. పేలుడు జరిపిన ఐ20 కారును నడిపింది డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని తేలింది. ఈ కుట్ర వెనుక డాక్టర్లు ముజమ్మిల్ షకీల్, షాహీద్ సయీద్‌ల హస్తం కూడా ఉంది. అయితే వీళ్లంతా తమ ప్లాన్‌ను అమలు చేయడానికి వాడిన టెక్నాలజీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వీరి కమ్యూనికేషన్ కోసం వాడింది ‘డెడ్ డ్రాప్’ ఇమెయిల్ టెక్నిక్. ఇది స్పై నెట్‌వర్క్‌లు, ఉగ్రవాదులు వాడే పాత పద్ధతి. కానీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారని తెలుస్తోంది. దీనికోసం వీళ్లంతా కలిసి ఒకే ఇమెయిల్ అకౌంట్‌ను వాడతారు. ఎవరైనా ఒక సందేశం పంపాలనుకుంటే, దాన్ని టైప్ చేసి ‘డ్రాఫ్ట్స్’ ఫోల్డర్‌లో సేవ్ చేస్తారు. అవతలి వ్యక్తి అదే అకౌంట్‌లోకి లాగిన్ అయి, ఆ డ్రాఫ్ట్‌ను చదివి, దాన్ని డిలీట్ చేస్తాడు. ఇమెయిల్ ఎప్పటికీ ‘పంపబడదు’ (Send) కాబట్టి, డిజిటల్ ఫుట్‌ప్రింట్ ఉండదు, ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యం.

వీరు కేవలం ఇమెయిల్‌పైనే ఆధారపడలేదు. నిఘా సంస్థల కళ్లుగప్పడానికి థ్రీమా, టెలిగ్రామ్ వంటి అత్యంత సురక్షితమైన, ట్రేస్ చేయలేని యాప్‌లను కూడా వాడినట్లు దర్యాప్తులో తేలింది. తమ కార్యకలాపాలు ఎక్కడా బయటపడకుండా ఉండేందుకు ఈ డాక్టర్లు టెక్నాలజీని చాలా పకడ్బందీగా వాడుకున్నారు. వీరి ప్లానింగ్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

నిజానికి, ఈ డాక్టర్లు ఇంకా పెద్ద విధ్వంసానికే ప్లాన్ చేశారు. పేలుడుకు కొద్ది రోజుల ముందే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముజమ్మిల్, షాహీద్‌లను అరెస్ట్ చేశారు. ఢిల్లీ సమీపంలో వీరు అద్దెకు తీసుకున్న ప్రాంతాల్లో సోదాలు చేయగా, ఏకంగా 3,000 కిలోల పేలుడు పదార్థాలు, బాంబు తయారీ సామాగ్రి దొరికాయి. షాహీద్ కారులో రైఫిల్, బుల్లెట్లు కూడా లభించాయి. వీరి అరెస్ట్‌తో, అసలు టెర్రర్ మాడ్యూల్ గుట్టు రట్టయింది.

తమ సహచరులు ఇద్దరూ అరెస్ట్ కావడంతో, డాక్టర్ ఉమర్ మహమ్మద్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దీంతో, తన దగ్గర ఉన్న బాంబుతో పానిక్ బటన్ నొక్కినట్లుగా, ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడ్డాడు. వీరంతా అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని ముజమ్మిల్ గదిలో రహస్య సమావేశాలు నిర్వహించి ఈ కుట్ర పన్నారని, వీరికి పాకిస్థాన్ ఆధారిత జైష్ఎ మొహమ్మద్‌తో సంబంధాలు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Related Post