తాజాగా వచ్చిన మొంథా తుఫాను, అనంతరం జరిగిన నష్టం.. కష్టంపై సీఎం చంద్రబాబు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతో సమీక్షలపై సమీక్షలు నిర్వహించారు. ప్రతి ప్రాంతం, మండలం సహా గ్రామాల నుంచి సమాచారం సేకరించారు. ఎంత నష్టం వచ్చింది.. ఎంత కష్టం మిగిలింది ? అనే అంశాలను ఆయన కూలంకషంగా చర్చించారు. సాగు, రహదారుల నష్టంపై పక్కా క్లారిటీని తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తుఫానును ఆపలేకపోయామని.. కానీ, భారీ నష్టాలు రాకుండా ప్రజలను , కొన్ని ఆస్తులను కాపాడుకో గలిగా మని చెప్పారు. “ఎప్పుడైనా కానీ.. తుఫానులు, ప్రకృతి విపత్తులను మనం ఆపలేం. కానీ, ముందస్తు అంచనా తో పనిచేస్తే.. నష్టాలను మాత్రం తగ్గించుకునే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు చేసి చూపించాం. ఒక్కరు కూడా తుఫాను కారణంగా ప్రాణాలు కోల్పోలేదు. కానీ, 120 పశువులు(గేదెలు, ఆవులు, గొర్రెలు వంటివి) మాత్రం చనిపోయాయి. ఇక, వ్యవసాయానికి ఎప్పుడూ వచ్చే నష్టమే ఇప్పుడు కూడా వచ్చింది అన్నారు.
మొత్తంగా 5265 కోట్ల రూపాయలకు పైగాన ష్టం వచ్చిందని ప్రాథమికంగా అధికారులు చెప్పినట్టు తెలిపారు. అయితే.. ప్రస్తుతం ఎన్యూమరేషన్ జరగాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నష్టంపై అంచనా వుంటుందని చెప్పారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న నష్టంపై కేంద్రానికి లేఖ రాస్తామని.. రిప్రజెంటేషన్ కూడా ఇస్తామని తెలిపారు. కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. కాగా.. అధికారులు, సిబ్బంది ముందస్తు చర్యల్లో కీలకంగా వ్యవహరించారని, ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చేయడం ద్వారా.. ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు.
అందుకే నష్టం తగ్గిందన్నారు. కాగా.. రైతులకు నష్ట పరిహారం త్వరలోనే ఇస్తామన్నారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల్లో రహదారులను క్లియర్ చేయడంతోపాటు.. ఎక్కడికక్కడ కూలిన చెట్లను కూడా తొలగించామని .. ఈ విష యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని చంద్రబాబు ప్రశంసించారు. తుఫానులు, ప్రకృతి విపత్తులను ఆపలేకపోయిన.. ప్రాణనష్టంగా జరగకుండా చూడడంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించిందని తెలిపారు.