hyderabadupdates.com movies తెగ ఊరించారు… విడుదల ఆపేశారు

తెగ ఊరించారు… విడుదల ఆపేశారు

రీ రిలీజుల విషయంలో ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోకూడదు. ఎందుకంటే ఫ్రీగా దొరికే సినిమాలను అదే పనిగా డబ్బులిచ్చి మరీ చూసి సెలబ్రేషన్స్ చేసే వాళ్ళ భావోద్వేగాలకు గౌరవం ఇవ్వాలి. లేదంటే చిక్కులు తప్పవు. అజిత్ బ్లాక్ బస్టర్ మూవీ అట్టహాసం ఇవాళ థియేటర్లలో రావాల్సి ఉంది. వారం నుంచే హడావిడి చేశారు. చెన్నైలో చాలా థియేటర్లు ముందుగానే హౌస్ ఫుల్ అయిపోయాయి. 2004లో వచ్చిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అజిత్ అభిమానులు ఓ రేంజ్ లో సందడి చేయడానికి రెడీ అయిపోయారు. కానీ చివరి నిమిషంలో ప్రింట్లు డెలివరీ కాలేదు.

దీంతో అట్టహాసంని అట్టహాసంగా ఆపేయడం చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విచిత్రమైన మరో విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఒరిజినల్ గా అట్టహాసం రిలీజైన 2004లోనూ నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు వచ్చి ప్రింట్లు ల్యాబ్ లోనే మగ్గిపోయాయి. అజిత్ తన పారితోషికంలో కొంత భాగాన్ని వెనక్కు ఇవ్వాల్సి రాగా ఆస్కార్ రవిచంద్రన్ డబ్బును సర్దుబాటు చేసి మోక్షం కలిగించేలా చూశారు. దీంతో ఎన్నో ఒత్తిళ్ల మధ్య అట్టహాసం అప్పట్లో 300 థియేటర్లలో రిలీజయ్యింది. హిట్టయ్యింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ప్రొడ్యూస్ చేసిన ముగ్గురు నిర్మాతలు నిండా మునిగేవారని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇప్పుడు కూడా అట్టహాసంకి ఇలాంటి సమస్యే రావడం వెరైటీ ట్విస్టు. శరన్ దర్శకత్వం వహించిన అట్టహాసంలో పూజా హీరోయిన్ గా నటించింది. ఈ శరన్ ఎవరో కాదు. వెంకటేష్ తో జెమిని తీసిన దర్శకుడు. తమిళంలో బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులోనూ ఆ బాధ్యత ఆయనకే ఇచ్చారు. కానీ ఇక్కడ వర్కౌట్ కాలేదు. ఒకదశలో పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తీయాలని శరన్ తెగ ప్రయత్నించి కథ కుదరక వదిలేశారు. ఏడు సంవత్సరాల నుంచి డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. అజిత్ ఫ్యాన్స్ మాత్రం ఈ అట్టహాసం పుణ్యమాని తీవ్ర అసహనంతో ఉన్నారు. అవును మరి ఊరించి ఊరించి ఆపేస్తే అలాగే ఉంటుంది.

Related Post