సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్ కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు.
ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్ కి అభినందనలు తెలియజేశారు. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్నారు అన్నారు. సజ్జనార్ తో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారని గుర్తు చేశారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకు వచ్చిందన్నారు. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి అని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు.
సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ శ్రీ వి.సి.సజ్జనార్ కి అభినందనలుడబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమా…— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 17, 2025