నిన్న మధ్యాన్నం హఠాత్తుగా నిర్ణయం తీసుకుని కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ రాత్రి ప్రీమియర్లు అప్పటికప్పుడు ఆన్ లైన్ లో జోడించారు. తెలంగాణలో లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అయినా వేద్దామని నిర్మాతలు తీసుకున్న నిర్ణయం ఏ మేరకు వర్కౌట్ అవుతుందోననే టెన్షన్ బయ్యర్లలో ఉండేది. అసలే కొంత ప్రీ రిలీజ్ నెగటివిటీ ఉంది. బెంగళూరులో ఓజి గొడవ, హైదరాబాద్ లో రిషబ్ శెట్టి కన్నడ స్పీచ్, ఆంధ్రాలో టికెట్ రేట్ల పెంపు తదితర కారణాలు కొంత వ్యతిరేకత తీసుకొచ్చాయి. కట్ చేస్తే చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు అన్ని సెంటర్లలో రాత్రి వేసిన రెండు మూడు షోలు మొత్తం హౌస్ ఫుల్స్ అయ్యాయి.
దీన్ని బట్టి తెలుగు ప్రేక్షకుల ప్రేమకు భాష హద్దులు ఉండవనేది అర్థం అవుతోంది. కాంతార తొలి భాగానికి టాలీవుడ్ జనాల్లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కన్నడ నేటివిటీ అయినా సరే అందులో ఎమోషన్ ప్లస్ డివోషన్ కు మన జనాలు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు అనే తేడా లేకుండా కాంతారని మూడేళ్ళ క్రితం ఎగబడి చూశారు. దాని ఫలితమే ఇప్పుడీ చాప్టర్ 1 మీద నెలకొన్న క్రేజ్. ఏపీలో టికెట్ రేట్లు పెంచినా సరే వన్ ప్లస్ వన్ ఆఫర్ తో 150 రూపాయల దాకా డిస్కౌంట్ ఇవ్వడం గొప్ప ఫలితాలు ఇస్తోంది. పండగ పూట ఎవరైనా సరే జంటగా చూసేందుకు ఇది గొప్ప ప్రమోషనల్ స్ట్రాటజీ. దసరా పండగ రోజు సగటున గంటకు ఎనభై వేలకు పైగా టికెట్లు ఆన్ లైన్ లో అమ్ముడుపోవడం కాంతార క్రేజ్ కు నిదర్శనం.
కూలీకి మన దగ్గర భారీ ఓపెనింగ్స్ వచ్చినా, కాంతార చాప్టర్ 1 ప్రీమియర్లు క్షణాల్లో సోల్డ్ అవుట్ అయినా దానికి కారణం మనమెప్పుడూ బాషా భేదాలు పెట్టుకోకపోవడమే. అందుకే ఇక్కడి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎంత రేట్ అయినా సరే కొనేందుకు సిద్ధ పడుతున్నారు. డబ్బింగ్ సినిమాలు యాభై నుంచి ఎనభై కోట్లు పలకడం మార్కెట్ స్థాయికి సూచిక. ఒకప్పుడు రజనీకాంత్ లాంటి స్టార్లకు మాత్రమే ఇంత రేట్లు పలికేవి. అవి కూడా విజువల్ గ్రాండియర్స్ అయితేనే. కానీ ఇప్పుడు కంటెంట్ మాట్లాడుతోంది. జనాల్లో ఎగ్జైట్ మెంట్ తేగలిగితే చాలు టికెట్ రేట్లు, పర్మిషన్లు ఇవన్నీ పెద్ద సీరియస్ గా ఆలోచించే విషయాలు కాదని అర్థమవుతుందిగా.