ఒకప్పుడు తెలుగులో తమిళ అనువాదాలు ఎంత బాగా ఆడేవో తెలిసిందే. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తిల చిత్రాలు తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టేవి. కానీ గత కొన్నేళ్లలో వీళ్లందరి జోరు తగ్గింది. తమిళ సినిమాల క్వాలిటీ పడిపోవడం, అదే సమయంలో తెలుగు సినిమాల స్థాయి పెరగడంతో అక్కడి చిత్రాలు మన వాళ్లకు అంతగా ఆనట్లేదు. ఐతే ఒకప్పుడు తనకంటే ఎక్కువ మార్కెట్ ఉన్న తమిళ స్టార్లు తెలుగులో డౌన్ అవుతుంటే.. ధనుష్ మాత్రం ఇక్కడ బలం పెంచుకుంటున్నాడు.
తెలుగులో అతను నేరుగా సార్, కుబేర చిత్రాలు చేసి ఇక్కడ తన మార్కెట్‌ను విస్తరించాడు. ఈ ఏడాది తెలుగులో పెద్ద హిట్లలో కుబేర కూడా ఒకటి. ఆ తర్వాత ధనుష్ సొంతంగా డైరెక్ట్ చేసిన ఇడ్లీ కొట్టు సరిగ్గా ఆడలేదు. ఈ చిత్రానికి ఓటీటీలో చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ధనుష్ మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ చిత్రమే.. అమర కావ్యం.
ధనుష్ సినిమాలను అనుసరిస్తున్న వాళ్లకు ఈ పేరుతో ఎప్పుడు మూవీ చేశాడు అనే సందేహం కలగొచ్చు. ఇది సౌత్ మూవీ కాదు. బాలీవుడ్లో అతను నటించిన ‘తేరే ఇష్క్ మే’కు తెలుగు వెర్షన్. ఇంతకుముందు ధనుష్ తో రాన్‌జానా లాంటి క్లాసిక్ తీసిన ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన కొత్త చిత్రమిది. కృతి సనన్ కథానాయికగా నటించింది. దీని టీజర్, ట్రైలర్ చాలా ఇంటెన్స్‌గా ఉండి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి.
బాలీవుడ్ లవ్ స్టోరీల్లో రాన్‌జానా లాగే ఇదొక కల్ట్ మూవీ అవుతుందనే అంచనాలు కలిగాయి. లీడ్ పెయిర్ పెర్ఫామెన్స్‌లు, లవ్-బ్రేకప్ సీన్లు, డైలాగులు హాట్ టాపిక్‌గా మారేలా కనిపించాయి. హిందీలో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ధనుష్ సినిమా అంటే తమిళంలో ఆటోమేటిగ్గా రిలీజవుతుంది కానీ.. అతను నటించిన హిందీ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఈ సినిమా మీద నమ్మకంతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. మంచి టైటిల్ కూడా పెట్టారు. ఈ నెల 28న అమరకావ్యం ప్రేక్షకుల ముందుకు రానుంది.