2025 సిద్ధూ జొన్నలగడ్డకి అచ్చి రాలేదు. జాక్ దారుణంగా ఫెయిలవ్వగా తెలుసు కదాకి సోషల్ మీడియా ప్రశంసలు తప్ప బాక్సాఫీస్ డబ్బులు పెద్దగా రాలేదు. సక్సెస్ మీట్లు, అభినందన సభలు పెట్టుకున్నారు కానీ ఆడియన్స్ దృష్టిలో అవేవీ పెద్దగా పని చేయలేదు. నిజానికి దర్శకురాలు నీరజ కోన బాలీవుడ్ కరణ్ జోహార్ తరహాలో అల్ట్రా అర్బన్ రిలేషన్స్ మీద కథ రాసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ అవి మన తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయా లేదానేది చెక్ చేసుకోకపోవడం దగ్గరే అసలు సమస్య వచ్చింది. మోడరన్ థింకింగ్ పేరుతో సామజిక ఆమోదం తక్కువగా ఉండే కాన్సెప్ట్స్ తీసుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి.
గతంలో ఇలాంటి ఎక్స్ పరిమెంట్లు ఎవరూ చేయలేదని కాలేదు. ఎప్పుడో మూడు దశాబ్దాల వెనుక సౌందర్యతో దర్శక నిర్మాత కె క్రాంతి కుమార్ ఇలాంటి ప్రయత్నమే చేశారు. విక్రమ్ కెరీర్ ప్రారంభంలో చేసిన తెలుగు సినిమాల్లో 9 నెలలు ఒకటి. కానీ కమర్షియల్ గా ఆడలేదు. అవార్డులు వచ్చాయి కానీ పాతికేళ్ల క్రితమే జనం దాన్ని తిరస్కరించారు. మహేష్ బాబుని రెండో సినిమాకే పిల్లాడి తండ్రిని చేసిన వైవిఎస్ చౌదరికి తాను ఎంత పొరపాటు చేశాడో యువరాజు ఫలితం వచ్చాకే అర్థమయ్యింది. కుచ్ కుచ్ హోతా హైలో షారుఖ్ ని చూడటం, మహేష్ ని ఇలాంటి పాత్రల్లో ఊహించుకోవడం ఒకటి కాదనే గొప్ప పాఠం తెలిసొచ్చింది.
ఇప్పుడు తెలుసు కదాలోనూ ఈ తరహా పొరపాటే రిపీట్ అయ్యింది. రెండో వారానికే చాలా చోట్ల ఫైనల్ రన్ వచ్చేసింది. షోలైతే రన్ అవుతున్నాయి కానీ వసూళ్లు మొక్కుబడిగానే ఉన్నాయి. కె ర్యాంప్ విజేతగా నిలవడం ఊహించని పరిణామం. డ్యూడే తెలుసు కదా కన్నా బెటరనే అభిప్రాయం యూత్ లో రావడం కూడా కొంత నష్టం చేసింది. అన్నీ డీజే టిల్లులే చేయాల్సిన అవసరం లేదు. ట్రెండ్ కి అనుగుణంగా తనకు సూటయ్యే కథలతో పెద్దగా రిస్క్ అవసరం లేకుండా సిద్దు సేఫ్ గేమ్ ఆడొచ్చు. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న బ్యాడ్ యాస్ లో సెన్సేషన్ అయ్యే కంటెంట్ చాలా ఉందంటున్నారు. చూడాలి మరి.