తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే బిసి సెంటర్లు కనిపించడం లేదు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ఇందులో ఎలాంటి మార్పు లేదు సరికదా ఇంకా కిందకు వెళ్తోంది. ఈ నెలలో డెకాయిట్ కొంతమేర ఊరట కలిగించినా మరీ లాంగ్ రన్ వచ్చే సూపర్ డూపర్ టాక్ సంపాదించుకోలేదు. అయినా సరే అడివి శేష్ బ్రాండ్, అన్నపూర్ణ మార్కెటింగ్ చాలా సానుకూలంగా పని చేశాయి.
తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఎంత పబ్లిసిటీ చేసినా లాభం లేకపోయింది. బ్యాడ్ బాయ్ కార్తీక్ కనీసం పోస్టర్ ఖర్చులు కూడా తేలేదు. ఇప్పుడే కాదు కొంచెం వెనక్కు వెళ్లి చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బైకర్ కు సోషల్ మీడియాలో దక్కిన మద్దతు టికెట్ కౌంటర్లలో అందలేదు. రాకాస ఏదో విరూపాక్ష రేంజ్ లో ఆడుతుందనుకుంటే బ్రేక్ ఈవెన్ దాటేసి ఇదే గొప్ప అనుకుంది. కపుల్ ఫ్రెండ్లీకి మల్టీప్లెక్సుల్లో దొరికిన సపోర్ట్ కింది స్థాయిలో కేంద్రాల్లో లేదు.
సంక్రాంతి తర్వాత యునానిమస్ అనిపించుకునే సినిమా లేకపోవడమే ఈ దుస్థితికి కారణం. ఇది ఎంత దారుణంగా ఉందంటే ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి స్టార్ మూవీ కాకుండా దురంధర్ ది రివెంజ్ లాంటి డబ్బింగ్ మూవీ కలెక్షన్ల మీద ఎగ్జిబిట్లర్లు ఆధారపడాల్సి వచ్చింది. ఒకేలా ఇది కూడా లేకుండా కొన్ని మల్టీప్లెక్సుల్లో జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయేవాళ్ళమని కొందరు పంపిణీదారులు చెప్పడం రియాలిటీని సూచిస్తోంది. ఫంకీ, విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ వగైరాలన్నీ టపా కట్టినవే.
మే ఒకటి వస్తున్న జెట్లీ, గాయపడ్డ సింహం ఏమైనా జోష్ ఇస్తాయేమో చూడాలి. కామన్ ఆడియన్స్ కి ఇవి ఇంకా రీచ్ కాలేదు. ప్రమోషన్లు జరుగుతున్నాయి కానీ తరుణ్ భాస్కర్, సత్యకు హీరోగా ఓపెనింగ్స్ తెచ్చేంత మార్కెట్ లేకపోవడంతో పూర్తిగా కంటెంట్ మీదే ఆధారపడాలి. ఈ వారం రిలీజవుతున్న మలయాళం బ్లాక్ బస్టర్ వాలా 2 ఏదో అద్భుతం చేస్తే తప్ప వీకెండ్స్ లో జనాలు కనిపించడం కష్టం. ప్రాపర్ కంటెంట్, స్టార్ సినిమాలు ఇవ్వకపోవడమే ఈ థియేటర్ కేకలకు కారణమని వేరే చెప్పాలా.