hyderabadupdates.com movies దురంధరా… అంత నిడివి భరిస్తారా

దురంధరా… అంత నిడివి భరిస్తారా

మనం అఖండ 2 తాండవం హడావిడిలో పడిపోయాం కానీ బాలీవుడ్ నుంచి వస్తున్న దురంధర్ మీద కూడా చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. అయితే ఫైనల్ కట్ 3 గంటల 32 నిముషాలు వచ్చిందని, అంతే నిడివికి సెన్సార్ చేయించుకుని ఆ వెర్షనే థియేటర్లలో ప్లే చేయబోతున్నట్టు సమాచారం. అంటే పుష్ప 2 ఫస్ట్ వెర్షన్, యానిమల్ కన్నా ఇది మరికొన్ని నిముషాలు ఎక్కువన్న మాట. అయితే ట్రేడ్ దీని గురించే వర్రీ అవుతోంది. ఇంత లెన్త్ జనాలు భరిస్తారానే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దానికి కారణం లేకపోలేదు. పుష్ప 2, యానిమల్ రెండు సినిమాలు మూడున్నర గంటాల దాకా ఉన్నా ప్రేక్షకులు ఒప్పుకున్నారంటే వాటి కంటెంట్ తో పాటు ప్రీ రిలీజ్ కు ముందు ఏర్పడిన హైప్ రక్షణ కవచంలా నిలబడింది. ఆయా దర్శకులు ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ కావడంతో రికార్డులు బద్దలయ్యాయి. కానీ దురంధర్ కి అలాంటి అట్రాక్షన్లు లేవు. ఉరి సర్జికల్ స్ట్రైక్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆదిత్య ధార్ ఏకంగా ఏడేళ్లు టైం తీసుకుని దురంధర్ తో వస్తున్నాడు. వయొలెన్స్, యాక్షన్, ఎలివేషన్లు భీభత్సంగా నింపిన నేపథ్యంలో వీటిని మాస్ ఎంతమేరకు అంగీకరిస్తారనేది చూడాలి.

ఇక అఖండ 2 ఈ దురంధర్ కాంపిటీషన్ ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఎందుకంటే హైందవ ధర్మం మీద రూపొందిన తమ సినిమాకే బ్రహ్మరథం దక్కుతుందనే ధీమాలో బాలయ్య టీమ్ ఉంది. దానికి తగ్గట్టే నార్త్ లో విస్తృతమైన పబ్లిసిటీ చేశారు. తెలుగు రాష్ట్రాలలో బజ్ కు లోటేమి లేదు కానీ ఈసారి బాలయ్య టార్గెట్ బాలీవుడ్ మీద గట్టిగానే ఉంది. అఖండకు ఓటిటిలో దక్కిన ఆదరణ దృష్టిలో ఉంచుకుని అఖండ 2కి భారీ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు. వర్కౌట్ అయ్యిందంటే మాత్రం నలుగురు సీనియర్ హీరోల్లో తొలి ప్యాన్ ఇండియా మూవీ బ్లాక్ బస్టర్ దక్కించుకున్న సీనియర్ స్టార్ బాలయ్యే అవుతారు.

Related Post