hyderabadupdates.com movies దేశానికి గేట్ వే గా మారనున్న ఆంధ్రప్రదేశ్!

దేశానికి గేట్ వే గా మారనున్న ఆంధ్రప్రదేశ్!

దేశానికి ఏపీ గేట్ వే(ప్ర‌ధాన ద్వారం)గా మారుతోంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ స్వ‌ర్గ‌ధామంగా మారుతుంద‌ని చెప్పారు. విశాఖ‌లో శుక్ర‌వారం ప్రారంభమైన పెట్టుబ‌డుల స‌ద‌స్సును ఉద్దేశించి సీఎం చంద్ర‌బాబు సుదీర్ఘంగా ప్ర‌సంగించారు. రాష్ట్రంలోను, దేశంలోనూ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం ఉంద‌న్న చంద్ర‌బాబు.. పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముందున్నాయ‌ని తెలిపారు. కాగా.. ఈ సద‌స్సుకు 72 దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

విశాఖలో అనేక అవ‌కాశాలు ఉన్నాయ‌ని చంద్ర‌బాబు తెలిపారు. కేంద్రం కూడా ఇటీవ‌ల విశాఖ‌ను సుర‌క్షిత‌ న‌గ‌రంగా ప్ర‌క‌టించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. పెట్టుబడిదారులకు అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తున్నామ‌ని.. ఎక్క‌డా నిర్ల‌క్ష్యం లేకుండా సింగిల్ విండో ద్వారా అనుమ‌తులు మంజూరు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. 2047లోగా భార‌త్ నంబర్‌ వన్‌ ఎనానమీ అవుతుందన్న ఆయ‌న‌.. ఏపీ కూడా విజ‌న్ 2047ను అందిపుచ్చుకుంద‌ని వివ‌రించారు.

ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూసే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఇంటికో పారిశ్రామిక వేత్త నినాదంతో ఏపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని సీఎం వివ‌రించారు. కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం కాకుండా.. ప‌నిలోనూ చేసి చూపిస్తున్నామ‌ని తెలిపారు. ఏపీకి స్పేస్‌ సిటీ, డ్రోన్‌ సిటీ, ఎలక్ట్రానిక్స్‌ సిటీ, క్వాంటమ్‌ వ్యాలీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ వస్తున్నాయన్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నెల‌లోనే అమ‌రావ‌తిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుడుతున్న‌ట్టు వివ‌రించారు.  

ఇక‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రులైన సోలార్‌, విండ్‌, పంప్డ్‌ ఎనర్జీలో ఏపీ ముందుంద‌న్నారు. స్థానిక ఉత్ప‌త్తుల‌కు గ్లోబ‌ల్ మార్కెటింగ్ క‌ల్పిస్తున్నామని తెలిపారు. అర‌కు కాఫీ, కొండ‌ప‌ల్లి బొమ్మ‌లు, పొందూరు ఖ‌ద్ద‌రు వంటివి అంత‌ర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్నాయ‌ని వివ‌రించారు. వ్యాపారం చేసేవారిని ప్రోత్సహిస్తున్నామని సీఎం చెప్పారు. మరో రెండేళ్లలో డ్రోన్‌ ట్యాక్సీలు కూడా వస్తాయన్నారు. ఆక్వా ఉత్ప‌త్తుల‌కు ఏపీ అగ్ర‌గామిగా ఉంద‌ని చంద్ర‌బాబు తెలిపారు.

రాష్ట్రంలో 2024 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పారిశ్రామిక వేత్త‌ల‌ను ప్రోత్స‌హించేలా 27 పాలసీలు తెచ్చామని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. పెట్టుబడిదారులకు ఎస్క్రో అకౌంట్‌ ఇస్తామని భారీ ప్ర‌క‌ట‌న చేశారు. మరో మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది తమ లక్ష్యమ‌న్న ఆయ‌న‌.. వ‌చ్చే పదేళ్లలో ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రావాలనేదే ధ్యేయంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని వివ‌రించారు. రాష్ట్రాభివృద్ధిలో పర్యాటకరంగానిది కీలకపాత్ర కానుందని తెలిపారు.

Related Post