దేశవ్యాప్తంగా 28 శాతం జీఎస్టీ ఉన్న చాలా వస్తువులు, సేవలను ఇప్పుడు 18 శాతం జీఎస్టీ లేదా 5 శాతం జీఎస్టీకే ప్రజలంతా పొందుతున్న సంగతి తెలిసిందే. ఇకపై, కేవలం జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉండేలా, ముఖ్యమంగా పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే జీఎస్టీ తగ్గింపుతో దసరా, దీపావళి సందర్భంగా ప్రజలకు సూపర్ సేవింగ్స్ లభించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలులో బహిరంగ సభ ఏర్పాటు చేసింది.
ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన,నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత సభలో ప్రసంగించిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో ఏపీ అభివృద్ధి ఎంతో కీలకమని, ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకం అని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులతో సీమ డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా, సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కొనియాడారు. ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునే యువతకు అపార శక్తి ఉందని అన్నారు. ఈ రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందానని చెప్పారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉందని కితాబిచ్చారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల 16 నెలలుగా ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఓ వైపు ఢిల్లీ, మరోవైపు అమరావతి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తామని, 21వ శతాబ్దం..140 కోట్ల మంది భారతీయుల శతాబ్దం అని అన్నారు.