దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి 7 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. కీలకమైన పర్యటక ప్రాంతం ఎర్రకోట వద్ద ఉన్న మెట్రో రైల్వే స్టేషన్ గేటు 1 దగ్గర పార్క్ చేసి ఉంచిన కారులో జరిగిన ఈ పేలుడు రాజధానిని ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ఘటనలో పలు కార్లు కాలి పోగా.. 8 మంది మృతి చెందినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి.. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ పేలుడు కారణాలపై అధ్యయనం చేస్తున్నామని.. అనుమానుతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నామని పోలీసులు తెలిపారు.
కాగా.. ఘటనా ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి భారీగా శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. సమీపంలోని పలు ఇళ్లలో గోడలు, వస్తువులు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇక, ఘటన జరిగిన ప్రాంతంలో బైకులు, కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఇక, ఈ ఘటన అనంతరం.. పెద్ద ఎత్తున ప్రజలు భీతిల్లారు. ప్రజలు పరుగులు పెట్టిన దృశ్యా లు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అయితే.. చిత్రం ఏంటంటే ప్రతి సోమవారం రాజధానిలో పర్యాటక ప్రాంతాలకు సెలవు ప్రకటిస్తున్నారు. దీంతో తాజాగా పేలుడు జరిగిన రోజు సోమవారం కావడంతో ప్రాణ నష్టం తప్పిందని పోలీసులుచెబుతున్నారు. కాగా.. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అనేక అనుమానాలు!
రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పేలుడు ఘటనపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇది కుట్ర పూరితంగా జరిగిందా? లేక.. ఉగ్రవాద కోణం ఉందా? అనే దిశగా పోలీసులు దృష్టి పెట్టారు. సోమవారం ఉదయం నుంచి మెట్రో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎవరు సంచరించారు, ముసుగులు ధరించిన వారు ఉన్నారా? లేక.. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇక, మరో రీజన్‌పై కూడా దృష్టి పెట్టారు. కారులో పేలుడు పదార్థాలు ఉంచి.. దూరంగా ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చారా? అనే కోణంలోనూ దర్యాప్తుచేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీసీఎం రేఖా గుప్తా.. ఈ ఘటనపై పర్యవేక్షించారు.