కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ దెబ్బకు తెలుగులో ఇడ్లి కొట్టుని జనాలు లైట్ తీసుకున్నారు. టాక్ అంతంతమాత్రంగా రావడం, నెగటివ్ రివ్యూలు, ఆడియన్స్ లో ఆసక్తి లేకపోవడం లాంటి కారణాలు చాలా తక్కువ ఓపెనింగ్స్ ని తీసుకొచ్చాయి. కొన్ని మెయిన్ సెంటర్స్ లో కాంతార ఓవర్ ఫ్లోస్ తో పాటు ధనుష్ ఇమేజ్ వల్ల కాసిన్ని నెంబర్లు కనిపించాయి కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇడ్లి కొట్టు మన దగ్గర ఫెయిల్యూర్ వైపే వెళ్లేలా ఉంది. కాకపోతే లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో దీని వల్ల ఏమైనా లాభం పొందుతుందేమో చూడాలి. కానీ తమిళనాడులో ఇడ్లి కడై సీన్ ఇక్కడికి భిన్నంగా పూర్తి రివర్స్ లో ఉంది.
నిన్న బుక్ మై షోలో ఇడ్లి కడై అమ్మిన టికెట్లు 1 లక్షా 70 వేలకు పైనే. రెండు రోజులు వరల్డ్ వైడ్ వసూళ్లు 21 కోట్లు దాటేశాయని ట్రేడ్ రిపోర్ట్. ఇందులో ఏపీ తెలంగాణ కాంట్రిబ్యూషన్ పది శాతం కూడా లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిన్న సాయంత్రం, ఈవెనింగ్ షోల ఆక్యుపెన్సీలు కొంచెం మెరుగ్గా అనిపించాయి కానీ బెస్ట్ అయితే కాదు. తమిళనాడులో సగటున 40 నుంచి 70 శాతం హాజరు నమోదు కాగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 25 శాతం లోపే పరిమితం కావడం గమనార్హం. అయితే ఓవరాల్ ఓపెనింగ్ గా చూసుకుంటే కుబేర, రాయన్ లను ఇడ్లి కడై దాటలేకపోయింది. అదొక్కటే ఫ్యాన్స్ కి లోటు.
చాలా తక్కువ హైప్ తో ఇడ్లి కడై ఇంత రాబట్టడం విశేషం. పూర్తి తమిళ నేటివిటీతో రూపొందిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోవడానికి ఓవర్ సెంటిమెంట్ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. గతంలో కార్తీ చినబాబు లాంటివి కోలీవుడ్ లో బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికి మన దగ్గర మాత్రం ఫ్లాప్ ముద్ర వేయించుకున్నాయి. ఒకవేళ కాంతార చాప్టర్ 1, ఓజి కనక ఇంత దూకుడుగా లేకపోయి ఇడ్లి కొట్టు సోలోగా వచ్చి ఉంటే బెటర్ రిజల్ట్ దక్కేదేమో కానీ అరవ సాంబార్ మనకు రుచించలేదన్నది వాస్తవం. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ డ్రామాలో నిత్య మీనన్ హీరోయిన్ గా నటించింది.