అమరావతి : రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులపై కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శనివారం శాసన సభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధానంగా ఆయన ధవళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి స్పందించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10.13 లక్షల ఎకరాలకు సాగు, లక్షలాది మంది ప్రజలకు తాగు నీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చుతోంది ధవళేశ్వరం బ్యారేజ్ అని చెప్పారు . గోదావరి డెల్టా వ్యవస్ధకు గుండె వంటిది ధవళేశ్వరం బ్యారేజ్ అని స్పష్టం చేశారు నిమ్మల రామానాయుడు.
2014 లో నాడు టిడిపి ప్రభుత్వం గోదావరి డెల్టా ఆధునీకరణ కింద 31.77 కోట్లతో 175 గేట్లలో 58 కొత్త గేట్లు ఏర్పాటు చేశామన్నారు. 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన 117 గేట్లు మార్చడానికి 150.09 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు నిమ్మల రామానాయుడు ప్రకటించారు. బ్యారేజ్ ప్రమాదంలో ఉందని CWC హెచ్చరించినా కూడా వైసీపీ ప్రభుత్వం బ్యారేజ్ వైపు కన్నెత్తి చూడలేదని సంచలన ఆరోపణలు చేశారు. నాడు బ్యారేజ్ కి నిధులిచ్చిన చంద్రబాబే, మరలా నేడు ధవళేశ్వరం బ్యారేజ్ కి కొత్త గేట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గోదావరి డెల్టా కాలువల్లో నీటి సరఫరాకు అంతరాయం లేకుండా సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టాప్ లాగ్ గేట్లను వినియోగిస్తూ, దశల వారీగా పనులు చేస్తామన్నారు.
గోదావరి డెల్టాలో ముంపు సమస్య, లాకులు, గేట్ల మరమ్మత్తులకు సమగ్ర డిపిఆర్ తయారు చేయడానికి, లైడార్ సర్వే కోసం 13.4 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏరియల్ లైడార్ సర్వే జరుగుతోందని చెప్పారు.
The post ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు మార్చేందుకు రూ. 150 కోట్లు
Categories: