మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్న నాగ వంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ పెద్దదే. తరచుగా తన స్టేట్ మెంట్లతో కొత్త రిలీజులకు బిల్డప్ ఇచ్చి ఇరకాటంలో పడే ఈ యువ నిర్మాత మాస్ జాతర విషయంలో ఎక్కువ హడావిడి చేయలేదు. వార్ 2 టైంలో తానన్న మాటలు, ఇచ్చిన ఎలివేషన్లు అన్నీ మిస్ ఫైర్ అవ్వడమే కాక దుబాయ్ వెళ్ళిపోయాడు లాంటి ట్రోలింగ్స్ కు దారి తీయడం బాగానే హర్ట్ చేసింది. అంతకు ముందు కింగ్డమ్ విషయంలో చూపించిన కాన్ఫిడెన్స్ ఫలితం రూపంలో దక్కలేదు. ఇప్పుడు మాస్ జాతరతో మరో ఫ్లాప్ ని మూటగట్టుకున్నారు. అయినా సరే నాగవంశీకి టెన్షన్ లేదనేది సన్నిహితుల మాట.
ఎందుకంటే సితార నిర్మాణంలో రూపొందిన కింగ్డమ్, మాస్ జాతరలు కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయినా నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో మంచి రెవిన్యూ తీసుకొచ్చాయి. థియేటర్ పరంగా జరిగిన నష్టాలను రికవర్ చేయడానికి నాగవంశీ ప్రొడక్షన్లో బోలెడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ముందు విశ్వక్ సేన్ ఫంకీ డిసెంబర్ కి రెడీ అవుతోంది. అల్లరి నరేష్ ఆల్కహాల్ జనవరి మొదటికి వచ్చేస్తుంది. మధ్యలో సంక్రాంతి సందడి చేయడానికి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు ఉండనే ఉన్నాడు. సూర్య – వెంకీ అట్లూరి కాంబోలో చేస్తున్న సినిమాకు హీరో ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా తెలుగు తమిళ భాషల్లో క్రేజ్ వచ్చేసింది.
ఇవి కాకుండా అశోక గల్లా, ఆనంద్ దేవరకొండ లాంటి అప్ కమింగ్ హీరోలతో చేస్తున్న ప్రాజెక్టులు క్రమంగా బజ్ తీసుకొచ్చేలా ఉన్నాయి. హారిక హాసిని బ్యానర్ లో వెంకటేష్ – త్రివిక్రమ్ మూవీ బంగారు బాతు అవుతుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. సో ఒకటి రెండు ఫెయిల్యూర్స్ వల్ల నాగవంశీకొచ్చిన ఇబ్బందేం లేదని చెప్పాలి. బయ్యర్లు కూడా ఫ్యూచర్ లైనప్ చూసే ఇప్పుడు చేసినవి ఆడకపోయినా సర్దుకుంటున్నారు. ఏది ఏమైనా మీడియాలో నాగవంశీ దూకుడు తగ్గించడం మంచిదేనని చెప్పాలి. మాటల కంటే చేతల ప్రభావం ఎక్కువ కాబట్టి మళ్ళీ ఒకటో రెండో హిట్లు పడ్డాక పాత స్కూల్ కు వచ్చేయొచ్చు.