దసరా పండగ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజిత్ కాంబోలో మూవీ పూజా కార్యక్రమాలతో ఇవాళ అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ కి ఇంకా టైం పడుతుంది కానీ ఇప్పటిదాకా కేవలం లీకుల్లో ఉన్న ఈ కలయికకు అధికారిక ముద్ర వేశారు. బ్లడీ రోమియో టైటిల్ చక్కర్లు కొడుతున్నా టీమ్ ఇంకా నిర్ధారణ చేయలేదు. అయితే చూసేందుకు ఎగ్జైటింగ్ గా అనిపిస్తున్న ఈ ప్రాజెక్టు ముందు చాలా బరువులు, సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ముందుగా సుజిత్ విషయానికి వస్తే ఓజి రూపంలో పవన్ కళ్యాణ్ కో బ్లాక్ బస్టర్ ఇచ్చాక సాహోతో వచ్చిన నెగటివ్ రిమార్క్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
ఇప్పుడు నానికి ఓజి రేంజ్ లో కంటెంట్ ఇవ్వాలి. ఎందుకంటే అంచనాలు ఆ కోణంలోనే ఉంటాయి. దసరా నుంచి తన ఇమేజ్ ని మాస్ వైపు తిప్పుతున్న నాని దానికి తగ్గట్టే సరిపోదా శనివారం, హిట్ 3 ది థర్డ్ కేస్ తో దాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వాలన్న ఉద్దేశంతో శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ ఒప్పుకున్నాడు. ఇప్పటిదాకా ఏ స్టార్ హీరో చేయని ఒక షాకింగ్ ఎలిమెంట్ తన పాత్రలో ఉంటుందనే టాక్ ఆల్రెడీ ఫ్యాన్స్ అంచనాలు పెంచేసింది. సో అది కనక క్లిక్ అయితే బ్లడీ రోమియో బిజినెస్ కు మరింత కిక్ వచ్చి ఇతర బాషల నుంచి కూడా హక్కుల కోసం డిమాండ్ ఏర్పడుతుంది.
ఇక సుజిత్ విషయానికి వస్తే సాహు, ఓజిలతో ఇద్దరు అతి పెద్ద స్టార్లను హ్యాండిల్ చేశాడు. వాళ్లతో సరితూగే రేంజ్ నానిది కాదు. అయినా సరే అంత స్థాయికి తీసుకెళ్లే అవుట్ ఫుట్ కనక సుజిత్ ఇవ్వగలిగితే యష్, రిషబ్ శెట్టి లాగా అమాంతం నాని ఇమేజ్, మార్కెట్ పెంచేయొచ్చు. పైగా సినిమాటిక్ యునివర్స్ అంటూ పలు సందర్భాల్లో సుజిత్ ఊరించడంతో ఇప్పటిదాకా తీసిన సినిమాలను కలుపుతూ కొత్త ప్రయోగం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఇది స్టాండ్ అలోన్ మూవీ అయితే అదేదో ముందే ప్రకటించేస్తే మంచిది.
ఇటీవలే మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజిత్ మాట్లాడుతూ వయొలెన్స్, ఎలివేషన్లు సాచురేషన్ స్టేజికి వచ్చేశాయని, అందుకే నెల్సన్ తరహా ట్రీట్ మెంట్ తో నెక్స్ట్ చేయబోయే సినిమా ఉంటుందనే రీతిలో హింట్ ఇవ్వడం గమనార్హం. డార్క్ కామెడీ, యాక్షన్ మేళవించి ఏదో ప్రయోగం చేయబోతున్న సూచనయితే సుజిత్ చేశాడు. 2026 చివర్లో విడుదలను టార్గెట్ చేసుకున్న నాని సుజిత్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి.