మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని ఆయన అన్నారు. అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే ఇస్తామన్నారు. నా ముందు అధ్యక్షా అనడం ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఆయన మీడియా ముందు కాక అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు. వైసీపీ ఎమ్యెల్యేలు జీతాలు తీసుకుంటున్నా అసెంబ్లీకి రావడం లేదన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరయ్యే అంశంపై ఏడాదిన్నరగా చర్చ సాగుతూనే ఉంది. తనకు ప్రతిపక్ష హౌదా కల్పించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఆ అంశం పెండింగ్‌లో ఉంది. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం లేదు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా ఈ విషయం చర్చకు దారితీస్తోంది.
అసెంబ్లీకి వస్తే మాకు సమయం ఇస్తారా..? సీఎం చంద్రబాబుకు ఇచ్చిన సమయం నాకూ ఇవ్వాలని ఆయన ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అసెంబ్లీకి వెళ్లలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసి రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళతాం అని ఆయన ఓ సందర్భంలో స్పష్టం చేశారు. దీనిపై మరోసారి స్పీకర్ క్లారిటీ ఇచ్చారిప్పుడు.. నా ముందు అధ్యక్షా అనలేకనే ఆయన అసెంబ్లీకి రాలేక పోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.