కార్యకర్తకు కష్టం వస్తే నేనున్నానంటూ.. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేశారు. జనసేన కార్యకర్తల సంక్షోభ సమయంలో పార్టీ మొత్తం ఒక కుటుంబంగా నిలబడుతుంది అనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. బుధవారం పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా, పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. వసంతరాయలు గత ఏడాది జులైలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో ఆయనకు బ్రెయిన్ డెడ్ స్థితి ఏర్పడగా, ఆయన కుటుంబ సభ్యులు ఆయన అవయవ దానానికి ముందుకు వచ్చారు.ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే, పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి స్వయంగా వెళ్లి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఆయన భార్య నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యుల సమస్యలను శ్రద్ధగా విన్న పవన్ కళ్యాణ్ కుమార్తె జాహ్నవికి వినికిడి లోపం మరియు మాటల సమస్య ఉన్నట్లు తెలుసుకొని, ఆమెకు టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా సహాయం అందించాలని అధికారులకు సూచించారు. అలాగే, సెల్ఫ్ ఎంఫ్లాయ్మెంట్ స్కీం కింద ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రూ. 5 లక్షల బీమా చెక్కును కూడా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇంటి పెద్దవారిని కోల్పోతున్న బాధలోనూ, వారి కుటుంబ సభ్యులు అవయవ దానం చేసిన సంఘటన తనను కదిలించమని పవన్ కళ్యాణ్ అన్నారు.
వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న పెడన నియోజకవర్గ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. పూలు, పూలమాలలతో కార్యకర్తలు, హారతులతో ఆడపడుచులు గ్రామ గ్రామాన స్వాగతం పలికారు. మచిలీపట్నం శివారు, పెడన, తోటమూల, హుస్సేన్ పాలెం, కట్లపల్లి, సింగరాయపాలెం, బల్లిపర్రు, మడక, నందమూరు, మంజులూరు, బంటుమిల్లి, చిన పాండ్రాక, చెరుకుమల్లి, కృత్తివెన్ను, గాంధీనగర్, పెద చందాల గ్రామాల్లో ప్రజలంతా రోడ్డు వెంట బారులు తీరారు.