ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా విషయంపై దృష్టి పెట్టారంటే.. అది సాధించే వరకు వెంట పడుతూనే ఉంటారు. అది ప్రజాసంక్షేమం కావొచ్చు.. పార్టీ కార్యక్రమం కావొచ్చు. ఏదైనా తన దృష్టికి వస్తే.. దానిలో మంచి చెడులు విచారించి తక్షణ చర్యలు తీసుకుంటున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతానికి చెందిన డీఎస్పీ జయ సూర్య వ్యవహారంపై కొన్నాళ్ల కిందట పవన్ సీరియస్ అయ్యారు.
ఆయన వ్యవహార శైలిపై వచ్చిన విమర్శలకు సంబంధించి నివేదిక కూడా కోరారు. స్థానిక జనసేన నాయకులను ఇబ్బంది పెట్టడం.. వేరే నేతలతో చేతులు కలపడం.. అవసరం వస్తే.. కూటమి నాయకుల పేర్లు వాడుకోవడం వంటివి జయసూర్య చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యంగా పేకాట, బెల్టు షాపుల విషయంపై జనసేన నాయకులు నేరుగా పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో జిల్లా ఎస్పీ నుంచి పవన్ కల్యాణ్ నెల రోజుల కిందట డీఎస్పీ వ్యవహారంపై నివేదిక కోరారు.
అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. డీఎస్పీ జయసూర్యను సమర్థిస్తూ.. మాట్లాడారు. అయితే.. పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చిన విషయాలు తనకు తెలియకపోవచ్చని చెప్పారు.
జయసూర్య బాగానే పనిచేస్తున్నారని రఘురామ చెప్పారు. ఇక, ఈ వ్యవహారం అప్పట్లో కొంత చర్చకు దారి తీసినా.. తర్వాత అందరూ మరిచిపోయారు. అయితే.. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భీమవరం డీఎస్పీగా ఉన్న జయసూర్యను అక్కడి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో రఘు వీర్ విష్ణు అనే డీఎస్పీని నియమించింది. ఇక, జయసూర్యకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా.. డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేసింది. దీంతో జయసూర్యకు ఎలాంటి పోస్టు ఇస్తారన్నది చూడాలి.
ఇదిలావుంటే.. తప్పు చేసిన ఏ అధికారినైనా పవన్ వదిలి పెట్టకపోవడం గమనార్హం. ఇటీవల తన శాఖ పంచాయతీరాజ్‌లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది అధికారులను తక్షణమే సస్పెండ్ చేయడం విశేషం.