hyderabadupdates.com movies ప‌వ‌న్‌కు అభిమానుల త‌ర‌ఫున దిల్ రాజు విన్న‌పం

ప‌వ‌న్‌కు అభిమానుల త‌ర‌ఫున దిల్ రాజు విన్న‌పం

సెల‌బ్రెటీల్లో కూడా పెద్ద ఎత్తున అభిమానుల‌ను సంపాదించుకున్న స్టార్ల‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌డు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా ప‌వ‌న్‌కు పెద్ద అభిమానే. ప‌వ‌న్ సినిమా తొలి ప్రేమ‌తోనే డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఆయ‌న కెరీర్ మ‌లుపు తిరిగింది. ఆ సినిమాతో నిల‌దొక్కుకుని, ఆ త‌ర్వాత నిర్మాత‌గానూ మారాడు. ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌ని ల‌క్ష్యం పెట్టుకుని వ‌కీల్ సాబ్ మూవీతో ఆ క‌ల‌ను నెర‌వేర్చుకున్నాడు. సంద‌ర్భం వ‌చ్చిన‌పుడ‌ల్లా ప‌వ‌న్ మీద త‌న అభిమానాన్ని చాటుకునే దిల్ రాజు.. ప‌వ‌ర్ స్టార్ కొత్త చిత్రం ఓజీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ల‌లో పాల్గొని త‌న అభిమాన క‌థానాయ‌కుడికి ఫ్యాన్స్ త‌ర‌ఫున ఒక విన్న‌పం చేశాడు.

ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. ఏడాదిలో కొంత స‌మ‌యాన్ని వీలు చేసుకుని ఒక సినిమా చేయాల‌ని కోరాడు దిల్ రాజు. ఇది త‌న‌తో పాటు అభిమానులంద‌రి కోరిక అని, ఆయ‌న సినిమాల‌కు దూరం కావొద్ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు ఎప్పుడూ ఇన్‌స్పిరేష‌నే అని దిల్ రాజు ఈ సంద‌ర్భంగా చెప్పాడు. క‌ళ్యాణ్ సినిమా కెరీర్లో ఫెయిల్యూర్లు చూసినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడ‌ని.. అలాగే రాజ‌కీయాల్లో కూడా వైఫ‌ల్యాలు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించి ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి అయ్యార‌ని.. తాను కూడా నిర్మాత‌గా అప‌జ‌యాలు ఎదురైన‌పుడ‌ల్లా ప‌వ‌న్‌నే స్ఫూర్తిగా తీసుకుని ధైర్యంగా ముందుకు సాగుతుంటాన‌ని దిల్ రాజు చెప్పారు.

తొలి ప్రేమ నుంచి క‌ళ్యాణ్‌కు తాను అభిమానిన‌ని ఆయ‌న తెలిపారు. ఓజీ సినిమాను ఒక అభిమానిగా ఎంతో ఎంజాయ్ చేశాన‌ని.. త‌న లాంటి ఫ్యాన్స్ క‌ళ్యాణ్‌ను ఎలా చూడాల‌నుకుంటారో అలా చూపించిన సుజీత్.. అంద‌రినీ ఉర్రూతూల‌గించాడ‌ని దిల్ రాజు వ్యాఖ్యానించాడు. త‌మన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడ‌ని.. సినిమాలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రూ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చార‌ని.. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత నిర్మాత దాన‌య్య పెద్ద హిట్ ఇచ్చినందుకు డిస్ట్రిబ్యూట‌ర్లు అంద‌రి త‌ర‌ఫున తాను థ్యాంక్స్ చెబుతున్నాన‌ని దిల్ రాజు అన్నాడు.

Related Post