ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉందని మూడు పార్టీల నేతల అభిప్రాయం. ఒక కట్టుబాటుగా మిగతా పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సంకటంగా మారింది. ఏ సందర్భం వచ్చినా కూటమిలో చిచ్చు పెట్టేందుకు, భేదాభిప్రాయాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందని కూటమి నేతల ఆరోపణ.
వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసేకొద్ది పవన్, లోకేష్ మరియు చంద్రబాబు వ్యక్తిగత, పార్టీ పరమైన స్వార్ధాలు చూసుకోకుండా కూటమి దృఢత్వానికి కృషి చేస్తున్నారు.
మరో 15 ఏళ్ల పాటు కూటమి ఇలాగే బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెబుతున్నారు. అయితే ఈ మాటలకు వైసీపీ వక్ర భాష్యం చెబుతూ, మళ్లీ మళ్లీ అరిగిపోయిన సీడీనే తిప్పుతున్నారు. ఈరోజు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అటువంటి వ్యాఖ్యలే చేశారు. ‘మరో 15 ఏళ్లు చంద్రబాబు సీఎం గా ఉంటారని పవన్ అంటున్నారు, అంటే పవన్ కళ్యాణ్ కు 70 వచ్చేవరకు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన లేదా..?’ అంటూ ఆయన ప్రశ్నించారు.
వైసీపీకి అర్థం కాని విషయం, చంద్రబాబు ముఖ్యమంత్రే అయినా, ఒక ఉపముఖ్యమంత్రిగా పవన్ స్థానాన్ని అనేక సందర్భాల్లో తనతో పాటుగానే ఉంచుతున్నారు తప్ప, తన కంటే కింద స్థానం అనే భావన ఎప్పటికీ తీసుకురావట్లేదు. లోకేష్ ఐతే అన్న అనే పిలుస్తున్నారు.
కూటమిలో నిప్పు రాజేసేందుకు ఎన్నికల ముందు నుంచి కూడా వైసీపీ చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ ప్రయత్నాలను చంద్రబాబు, పవన్, లోకేష్ సమర్థంగా తిప్పి కొడుతున్నారు. ఇరు పార్టీల శ్రేణులకు కూటమి బలంగా ఉండాల్సిన ఆవశ్యకతను ప్రతిసారి వివరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ స్థాయి ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పాలనా దక్షతను క్యాబినెట్ సమావేశంలో ప్రస్తుతిస్తున్నారు. ఆయన సూచనలు తీసుకుంటున్నారు. వైసీపీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఇరు పార్టీల నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఐతే వైసీపీ మాత్రం పదే పదే అదే పాట పాడుతుండడంతో, పవన్ సీఎం కావాలని వైసీపీకి అంత కోరికగా ఉందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.