కొద్ది సంవత్సరాల క్రితం వరకు చట్ట సభలను సభ్యులు పరమ పవిత్రంగా…దేవాలయాల మాదిరిగా చూసేవారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు సభలో ఎంతో హుందాగా, బాధ్యతగా నడుచుకునేవారు. కాలం మారింది…కలికాలం వచ్చింది…అందుకే కాబోలు గత దశాబ్ద కాలంలో చట్ట సభల్లో కొందరు సభ్యుల తీరు వివాదాస్పదవుతున్న ఘటనలు చూస్తున్నాం.
ఎంతో కీలకమైన సభా సమయంలో మొబైల్ ఫోన్లలో నీలి చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్ అయిన సభ్యుల గురించి విన్నాం. ఆ కోవలోనే సభను అవమానించే మాదిరిగా టీఎంసీ సభ్యులు లోక్ సభలో ఈ-సిగరెట్ తాగారన్న ఆరోపణలు సంచలనం రేపాయి.
లోక్‌సభలో టీఎంసీ పార్టీకి చెందిన ఎంపీలు ఈ-సిగరెట్ తాగుతుంటే చూశానని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. చాలా రోజులుగా టీఎంసీ ఎంపీలు ఇలా చేస్తున్నారని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కోరారు. ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకువెళ్లారు.
పైగా దేశమంతా ఈ-సిగరెట్ పై బ్యాన్ ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. అసలు సభలో ఈ-సిగరెట్ తాగడానికి అనుమతిస్తారా? అంటూ స్పీకర్ ఓం బిర్లాను అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. అయితే, అందుకు అనుమతించబోమని ఓం బిర్లా తేల్చి చెప్పేశారు. లోక్‌సభ సభ్యులను ఉద్దేశించి ఆయన ఒక రూల్ కూడా పాస్ చేశారు. ఇకపై సభలో ఎవరైనా సిగరెట్ తాగినట్లుగా తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడాలని, లేదంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమాలకు కట్టుబడి ఉండాలని. ఇకపై ఇలాంటివి తన దృష్టికి వస్తే సహించబోనని అన్నారు. మన దేశంలో 2019 నాటి నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్లపై నిషేధం ఉంది. ఈ-సిగరెట్ల తయారీ, దిగుమతి , విక్రంయం, పంపిణీ, నిల్వ చేయడం, ఈ-సిగరెట్ లకు సంబంధించి ప్రకటనలు చేయడం చట్టవిరుద్ధం. మరోవైపు, పార్లమెంట్ రూల్ బుక్ ప్రకారం సభలో ధూమపానం నిషేధం.