పిపిపి విధానంలో అభివృద్ధి చేయబడుతున్న కళాశాలలకు ‘ ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ‘ అని నామకరణం చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పేరుతో పాటు కళాశాల ఉండే ప్రదేశం పేరును జోడించాలి. ఉదాహరణకు…ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, మార్కాపురం. దీని కింద పిపిపి భాగస్వామి పేరును కూడా ప్రస్తావించవచ్చు. ఈ రెండు పేర్లను 70:30 నిష్పత్తిలో ప్రదర్శించాలని నిర్ణయించింది.
నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వైద్యారోగ్య శాఖకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ కొన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకుంది. పిపిపి విధానంలో చేపట్టనున్న ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ, ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ మరియు నియంత్రణకు సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ కళాశాలలకు కేటాయించిన భూములను ఎటువంటి వాణిజ్యపరమైన, వైద్యేతర కార్యక్రమాలకు వినియోగించరాదని కేబినెట్ స్పష్టం చేసింది. ఈ భూముల్లో 625 పడకల ఆసుపత్రి, 150 యుజి మరియు 24 పీజీ సీట్లతో కూడిన కాలేజీ నిర్మాణం, వసతి గృహాలు, బోధన మరియు ఇతర సిబ్బంది నివాసాల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని క్యాబినెట్ తెలిపింది. వీటితో పాటు భవిష్యత్తు అవసరాల మేరకు దంత వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, టెలీమెడిసిన్ కేంద్రాలు, శిక్షణ కేంద్రాలు, ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని కేబినెట్ నిర్ణయించింది. ఈ అదనపు అభివృద్ధి చర్యల ద్వారా వచ్చే ఆదాయంలో 3 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
పిపిపి విధానంలో ఆయా ఆసుపత్రుల నిర్వహణ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఆయా కాలేజీలకు సంబంధించిన బోధానాసుపత్రుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య మరియు ఇతర సిబ్బంది జీతాలను రెండేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుందని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. పిపిపి భాగస్వాములు సొంత ఆసుపత్రులను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి పట్టే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పిపిపి విధానం కింద కొత్త ఆసుపత్రుల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రస్తుతం నడుస్తున్న బోధనాసుపత్రులు తిరిగి ప్రభుత్వ పరిధిలోకొస్తాయి.